NV Ramana: ఆ పాట వింటే ఎంతో భావోద్వేగం కలుగుతుంది: సీజేఐ ఎన్వీ రమణ
- హైదరాబాదులో జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీజేఐ
- రవీంద్రభారతిలో ఘంటసాల శతజయంతి వేడుకలు
- ముఖ్యఅతిథిగా వచ్చిన ఎన్వీ రమణ
- పి.సుశీలకు ఘంటసాల పురస్కారం ప్రదానం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు హైదరాబాదులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన ఘంటసాల శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సుప్రసిద్ధ గాయని పి.సుశీలకు ఘంటసాల పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, ఘంటసాల పురస్కారం అందించడం తన అదృష్టమని పేర్కొన్నారు.
ఘంటసాల పాటలు మన జీవితాలతో పెనవేసుకున్నాయని అన్నారు. జీవితంలో ఎదుర్కొన్న అనేక కష్టాలే ఘంటసాలను మానవతామూర్తిగా నిలిపాయని కీర్తించారు. ఘంటసాల గానం చేసిన తెలుగువీర లేవరా గీతం వింటే ఇప్పటికీ ఎంతో భావోద్వేగం కలుగుతుందని సీజేఐ వెల్లడించారు. తొలినాళ్లలో సినిమా రంగానికి బాధ్యతాయుతమైన పాత్ర ఉండేదని, మన భాషా సంస్కృతులు క్రమంగా పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాష ఉన్నతికి ప్రభుత్వాలు కూడా మద్దతు ఇవ్వడంలేదని విచారం వెలిబుచ్చారు.