Rachamallu: మేం విజయమ్మను ఎంత గౌరవిస్తామో నారా భువనేశ్వరిని అంతే గౌరవిస్తాం: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు
- ఇటీవల భువనేశ్వరి కేంద్రబిందువుగా వివాదం
- తన భార్యను కించపరిచారంటూ బాబు మనస్తాపం
- క్షమాపణ చెప్పిన వల్లభనేని వంశీ
- కన్నీళ్లతో భువనేశ్వరి పాదాలు కడుగుతామన్న రాచమల్లు
ఇటీవల తన అర్ధాంగి నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందడం తెలిసిందే. దీనిపై ఇటీవలే టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణ కూడా చెప్పారు. ఈ అంశంపై ప్రొద్దుటూరు శాసనసభ్యుడు, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. వంశీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాదని, కానీ ఆ వ్యాఖ్యలు వైసీపీ నేతలు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అది సమంజసం అనిపించుకోదని అన్నారు.
భువనేశ్వరి తామందరికీ సోదరి సమానురాలని అన్నారు. ప్రజా గౌరవసభల పేరిట ఓ మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అని పేర్కొన్నారు. వైఎస్సార్ అర్ధాంగి విజయమ్మ పట్ల ఎంత గౌరవం చూపిస్తామో, నారా భువనేశ్వరిని కూడా అంతే గౌరవిస్తామని రాచమల్లు స్పష్టం చేశారు. వంశీ చేసిన వ్యాఖ్యలను సహచర ఎమ్మెల్యేలందరం ఖండించామని వెల్లడించారు.
భువనేశ్వరి ఈ వ్యాఖ్యలతో మనస్తాపం చెంది ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలందరం కన్నీళ్లతో ఆమె పాదాలు కడుగుతామని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు కూడా ఓట్ల కోసం ఈ అంశాన్ని మరింత పెద్దది చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రొద్దుటూరులో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచమల్లు ఈ వ్యాఖ్యలు చేశారు.