AK-203: ఏకే-47 రైఫిళ్ల కొత్త వెర్షన్ ఏకే-203... అమేథీలో తయారీకి కేంద్రం సన్నాహాలు
- రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక
- భారత్ లో ఏకే-203 ఉత్పత్తి కోసం ఒప్పందం
- సాంకేతికతను భారత్ కు బదలాయించనున్న రష్యా
- ఆత్మనిర్భర్ లో భాగంగా భారత గడ్డపైనే ఏకే-203ల ఉత్పత్తి
ఏకే-47... ఇదొక అస్సాల్ట్ రైఫిల్. దాదాపు ఏడు దశాబ్దాల కిందట నాటి సోవియట్ యూనియన్ లో రూపుదిద్దుకున్న ఈ ఆయుధం నేడు ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పుడు దీనికి సరికొత్త వెర్షన్ వచ్చింది. దాన్ని ఏకే-203గా పిలుస్తున్నారు. ఇది ఏకే-47తో పోల్చితే అత్యాధునికమైనది. ఇది ఎంతో తేలికైనది, శక్తిమంతమైనది. 3.8 కేజీల బరువున్న ఈ తుపాకీతో 400 మీటర్ల నుంచి 800 మీటర్ల రేంజిలో ప్రభావవంతంగా కాల్పులు జరిపే వీలుంటుంది. 300 మీటర్ల వరకు అయితే మాత్రం కచ్చితంగా గురితప్పకుండా కాల్చవచ్చు.
దీనికి 30 రౌండ్ డిటాచబుల్ బాక్స్ మ్యాగజైన్, 50 రౌండ్ డిటాచబుల్ క్వాడ్ కాలమ్ మ్యాగజైన్లను అమర్చుకోవచ్చు. నిమిషానికి 700 రౌండ్లు కాల్పులు జరపడం దీని ప్రత్యేకత.
ఈ ఆయుధంపై భారత్ అత్యంత ఆసక్తి చూపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో 5 లక్షల ఏకే-203 రైఫిళ్లను తయారుచేసేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా అత్యాధునిక రైఫిళ్లను దేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు భారత్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఏకే-203ల ఉత్పత్తికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ ఒప్పందం కుదిరితే రైఫిళ్ల తయారీకి సంబంధించిన డేటా అంతా రష్యా... భారత్ కు బదలాయిస్తుంది.