Tanguturu: టంగుటూరు తల్లీకూతుళ్ల హత్యకేసులో పురోగతి.. పోలీసుల అదుపులో మహారాష్ట్ర ముఠా
- తల్లీకుమార్తెలను హత్యచేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ముఠా
- హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్లిపోయిన ముఠా
- షోలాపూర్‌లో అదుపులోకి
- జిల్లా నుంచి బయలుదేరిన పోలీసు బృందం
ప్రకాశం జిల్లా టంగుటూరులో సంచలనం సృష్టించిన తల్లీకుమార్తెల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతులు జలదంకి శ్రీదేవి (43), వెంకట లేఖన (21)లను దారుణంగా హత్య చేసిన దుండగులు వారి ఒంటిపై ఉన్న దాదాపు 20 సవర్ల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గత నెల 19న అర్ధరాత్రి ఇంకొల్లు మండలం పూసపాడు సమీపంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వృద్ధ దంపతులను హత్య చేసిన దుండగులు వృద్ధురాలి చెవిని కోసేసి మరీ బంగారు కమ్మలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు హత్యల వెనక ఒకే ముఠా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు.
దోపిడీ దొంగలు టోల్‌ప్లాజా, ఒంగోలు, అద్దంకి మీదుగా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర పోలీసులతో సంప్రదించారు. ఈ క్రమంలో షోలాపూర్ వద్ద ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారు టంగుటూరు నుంచే వస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా పోలీసు బృందం షోలాపూర్ బయలుదేరింది.