Cricket: కోహ్లీ అందుకే ఫాలో ఆన్ ఇవ్వలేదట!
- 3 రోజుల్లో ఆట అయిపోతే అదనపు పాయింట్లేమీ రావన్న దినేశ్ కార్తీక్
- తన బ్యాటర్లకు అవకాశం ఇచ్చాడని కామెంట్
- ఎంత బ్యాటింగ్ చేస్తే పిచ్ అంత దారుణంగా అవుతందని వెల్లడి
- అప్పుడు న్యూజిలాండ్ ను చుట్టేయడం మరింత తేలికవుతుందని కామెంట్
- కోహ్లీ నిర్ణయాన్ని సమర్థించిన కివీ మాజీ స్పిన్నర్ వెటోరి
ఫస్ట్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ను 62 పరుగులకే చుట్టేసి భారత్ పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. మనకు 263 పరుగుల ఆధిక్యమూ లభించింది. ఈ స్థితిలో న్యూజిలాండ్ ఫాలో ఆన్ లో పడినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ ను మనమే బ్యాటింగ్ చేశాం. అంత మెరుగైన స్థితిలో ఉండి కూడా కోహ్లీ ఎందుకు ఫాలో ఆన్ ఆడించలేదు? అన్న ప్రశ్నలు తలెత్తాయి. దానికి మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ సమాధానం చెప్పాడు.
అందరిలాగే తన మదిలోనూ అదే ప్రశ్న తిరిగిందని చెప్పిన అతడు.. తర్వాత దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటించాల్సి ఉందని గుర్తు చేశాడు. అయితే, ప్రస్తుత టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. మూడు నాలుగు రోజుల్లో ఆట ముగిసిపోతే జట్టుకు అదనపు పాయింట్లేమీ రాబోవని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ ఎంత ఎక్కువ సేపు చేస్తే.. వికెట్/పిచ్ అంత దారుణంగా తయారవుతుందని తెలిపాడు. కాబట్టి న్యూజిలాండ్ ను తొందరగా చుట్టేయడానికి వీలవుతుందని దినేశ్ కార్తీక్ చెప్పాడు.
ప్రస్తుతం మ్యాచ్ లో గెలుపు అవకాశాలు భారత్ కే ఎక్కువున్నాయన్నాడు. భారత్ లీడ్ లో ఉందని, చాలా ఎక్కువ పరుగులే ఉన్నాయని తెలిపాడు. బ్యాటింగ్ లో పుజారా లాంటి వాళ్లు పరుగులు చేసేందుకు కోహ్లీ అవకాశం ఇచ్చాడని అన్నాడు. కోహ్లీ కూడా ఈ సిరీస్ లో ఆడుతున్నది ఒకటే మ్యాచ్ కాబట్టి.. తానూ బ్యాటింగ్ లో కొన్ని పరుగులు చేసి సత్తా చాటాలని భావిస్తుండొచ్చన్నాడు. మరిన్ని పరుగులు చేశాక ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తారని తెలిపాడు.
బౌలర్లకు విశ్రాంతినివ్వాలన్న ఉద్దేశంతో ఫాలోఆన్ పై వెనుకడుగు వేయడం కాదని, ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉన్నప్పుడు ఫాలో ఆన్ ఇవ్వడం వ్యర్థమని తాను అనుకుంటున్నానని చెప్పాడు. ఫాలో ఆన్ ఆడించి అందరినీ ఆలౌట్ చేస్తే అదనపు పాయింట్లు ఇచ్చేలా పాయింట్ సిస్టమ్ ఉంటే బాగుండేదన్నాడు. కాబట్టి న్యూజిలాండ్ ను ఫాలో ఆన్ ఆడించకుండా కోహ్లీ తన బ్యాటర్లకు అవకాశం కల్పించడం మంచి నిర్ణయమేనని సమర్థించాడు.
ఇటు న్యూజిలాండ్ మాజీ లెజెండ్ స్పిన్నర్ డేనియల్ వెట్టోరి కూడా కోహ్లీ నిర్ణయాన్ని వెనకేసుకొచ్చాడు. బౌలర్లకు విశ్రాంతినివ్వాలన్న ఉద్దేశంతో చాలా మంది కెప్టెన్లు ఫాలో ఆన్ ను వ్యతిరేకించేవారని చెప్పాడు. అయితే, భారత బౌలర్లు కేవలం 29 ఓవర్లే వేసినా కోహ్లీ ఫాలో ఆన్ ఆడించకపోవడంలో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ కు మాత్రం కష్టాలు తప్పవని, భారత్ దే పైచేయి అని అన్నాడు.