Sourav Ganguly: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చాలా దరిద్రంగా ఆడిందట.. గంగూలీ తీవ్ర అసంతృప్తి

 Ganguly Says Indias T20 World Cup Performance Poorest

  • గత నాలుగైదేళ్లలో నేను చూసిన దారుణమైన ఆట ఇదే
  • 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వరల్డ్ కప్‌లో భారత్ బాగా ఆడింది
  • పాకిస్థాన్, కివీస్‌లపై భారత్ తన సామర్థ్యంలో 15 శాతంతో మాత్రమే ఆడింది
  • కారణాలపై ఎవరినీ వేలెత్తి చూపించలేం

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఘోర పరాజయంపై టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత నాలుగైదేళ్లలో తాను చూసిన అత్యంత దారుణమైన ప్రదర్శన ఇదేనని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ నాకౌట్ దశలోనే ఇంటిముఖం పట్టింది. లీగ్ దశలో తొలుత పాకిస్థాన్, ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటములు భారత్ పుట్టిముంచాయి. చివరికి సెమీఫైనల్స్‌కు చేరుకోవాలంటే ఇతర జట్ల ఓటమిపైనా, వాటి రన్‌రేట్ పైనా ఆధారపడాల్సి వచ్చింది. చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి తర్వాత పుంజుకున్న భారత్.. ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలతో జరిగిన మ్యాచ్‌లలో వరుసగా విజయం సాధించినప్పటికీ అప్పటికే చేతులు కాల్చుకుని ఉండడంతో ఫలితం లేకుండా పోయింది.

2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్‌లలో ఇండియా అద్భుతంగా రాణించిందని, కానీ 2021 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయిందని గంగూలీ పేర్కొన్నాడు. 

‘‘నిజం చెప్పాలంటే 2017, 2019లో భారత్ చాలా బాగా ఆడింది. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. అప్పట్లో నేను కామెంటేటర్‌గా ఉన్నాను.  2019 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరిగింది. అందరినీ ఓడించిన టీమిండియా సెమీస్‌లో కివీస్ చేతిలో ఓటమి పాలైంది. మనది కాని ఓ చెడ్డ రోజున రెండు నెలలపాటు పడిన కష్టం ఊడ్చిపెట్టుకుపోయింది’’అని ‘‘బ్యాక్‌స్టేజ్ విత్ బొరియా’ షోలో బొరియా మజుందార్‌తో మాట్లాడుతూ గంగూలీ చెప్పుకొచ్చాడు.

 ‘‘ఈ టీ20 ప్రపంచకప్‌లో మాత్రం భారత జట్టు ప్రదర్శనతో చాలా అసంతృప్తికి గురయ్యా. గత నాలుగైదేళ్లలో నేను చూసిన అత్యంత దారుణమైన ప్రదర్శన ఇదే’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

 అయితే, దీని వెనక కారణాలు ఏంటన్నది తనకు తెలియదని పేర్కొన్న గంగూలీ.. తగినంత స్వేచ్ఛగా ఆడలేదని మాత్రం తనకు అనిపించిందన్నాడు. కొన్నిసార్లు  పెద్ద టోర్నీలలోనే ఇలా జరుగుతుందన్నాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు వారు తమ సామర్థ్యంలోని 15 శాతాన్ని మాత్రమే వినియోగిస్తున్నట్టు అనిపించింది. అయితే, అలా ఎందుకు జరిగిందన్న దానిపై ఎవరినీ వేలెత్తి చూపించలేమని  గంగూలీ వివరించాడు.

  • Loading...

More Telugu News