Team India: ముంబయి టెస్టు: ముగిసిన మూడో రోజు ఆట... విజయానికి 5 వికెట్ల దూరంలో భారత్
- గెలుపు ముంగిట కోహ్లీ సేన
- కివీస్ ముందు 540 పరుగుల టార్గెట్
- ప్రస్తుతం 5 వికెట్లకు 140 రన్స్ చేసిన కివీస్
- ఇంకా 400 పరుగులు వెనుకబడి ఉన్న వైనం
ముంబయి టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన కోహ్లీ సేన... విజయానికి మరో 5 వికెట్ల దూరంలో నిలిచింది. భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు. ఆటకు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలుండగా, డ్రా కోసం ఆడడం కివీస్ శక్తికి మించిన పని అని చెప్పాలి.
ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోల్స్ 36, రచిన్ రవీంద్ర 2 పరుగులతో ఉన్నారు. వన్ డౌన్ లో వచ్చిన డారిల్ మిచెల్ 60 పరుగులు చేశాడు. తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ 6, ఓపెనర్ విల్ యంగ్ 20, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 6 పరుగులు చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ బ్లండెల్ (0) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేయగా, కివీస్ 62 పరుగులకు ఆలౌటైంది. భారత్ కు కీలకమైన 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ ను భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 500 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.