Pakistan: ఇండో-పాక్ సరిహద్దులో బిడ్డకు జన్మనిచ్చిన పాక్ మహిళ.. చిన్నారికి ‘బోర్డర్’ అంటూ నామకరణం!
- లాక్‌డౌన్‌కు ముందు భారత్ వచ్చి చిక్కుకుపోయిన పాకిస్థానీలు
- అట్టారి సరిహద్దు వద్ద పడిగాపులు
- అవసరమైన పత్రాలు లేకపోవడంతో అనుమతి నిరాకరిస్తున్న పాకిస్థాన్
- జోధ్‌పూర్‌లో జన్మించిన మరో బిడ్డకు ‘భారత్’ అని నామకరణం
భారత్-పాకిస్థాన్ మధ్య విద్వేషాలు ఈనాటివి కావు. దేశ విభజన నాటి నుంచే రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండూ ఆగర్భ శత్రువులుగానే ఉన్నాయి. అయితే, భారత్-పాక్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ ఇరు దేశాల ప్రజలు ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు కురిపించుకున్న ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ నెల 2న ఇండో-పాక్ సరిహద్దులో జరిగిన ఘటన మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది.
సరిహద్దులో జన్మించిన తమ అబ్బాయికి పాకిస్థానీ దంపతులు ‘బోర్డర్’ అని పేరు పెట్టుకోవడం అందరినీ ఆకర్షించింది. అట్టారి సరిహద్దు వద్ద గత 71 రోజులుగా చిక్కుకుపోయిన 98 మంది పాకిస్థానీలలో ఈ జంట కూడా ఉంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన ఈ దంపతుల పేర్లు నింబుబాయి-బాలమ్ రామ్. భారత్-పాక్ సరిహద్దులో బాబు జన్మించడంతో ఆ చిన్నారికి ‘బోర్డర్’ అని నామకరణం చేసినట్టు వారు పేర్కొన్నారు.
గర్భిణి అయిన నింబూబాయికి ఈ నెల 2న పురిటి నొప్పులు వచ్చాయి. విషయం తెలిసిన సమీపంలోని పంజాబ్ ప్రజలు కొందరు ఆమె డెలివరీకి సాయం చేశారు. చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.
లాక్‌డౌన్‌కు ముందు యాత్ర కోసం మొత్తం 98 మంది కలిసి భారత్‌కు వచ్చామని, అయితే, అవసరమైన పత్రాలు తమ వద్ద లేకపోవడంతో తిరిగి స్వదేశానికి చేరుకోవడం కష్టంగా మారిందని బాలమ్ రామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ బృందంలో మొత్తం 47 మంది చిన్నారులు ఉన్నారని, వారిలో ఆరుగురు ఇండియాలోనే జన్మించారని పేర్కొన్నారు.
బాలమ్ రామ్‌తో కలిసి ఒకే టెంటులో ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన లగ్యా రామ్ కూడా తన కుమారుడికి ‘భారత్’ అని పేరు పెట్టాడు. గతేడాది జోధ్‌పూర్‌లో ఆ బాబు జన్మించాడు. జోధ్‌పూర్‌లో ఉంటున్న తన సోదరుడిని కలిసేందుకు తాను ఇండియా వచ్చి చిక్కుకుపోయినట్టు లగ్యారామ్ వివరించాడు.
పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా ప్రస్తుతం అట్టారి సరిహద్దు వద్ద ఓ టెంట్‌లో నివసిస్తున్నారు. వీరిని దేశంలోకి అనుమతించేందుకు పాకిస్థానీ రేంజర్లు నిరాకరిస్తున్నారు. వీరికి స్థానికులు ప్రతి రోజూ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన మందులు, దుస్తులు సరఫరా చేస్తున్నారు.