America: పాములు పోతాయని పొగపెడితే.. రూ. 13 కోట్ల విలువైన ఇల్లు కాలిబూడిదైంది!
- అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఘటన
- ఇంట్లో తిరుగుతూ భయపెడుతున్న పాములు
- పీడ వదిలించుకునేందుకు బొగ్గుతో పొగ
- మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఇల్లు
పాముల బెడదను వదిలించుకుందామని ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పాములే కాదు, వాటితోపాటు 13 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు కూడా కాలిబూడిదైంది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరిగిందీ ఘటన.
స్థానికంగా నివసించే ఓ వ్యక్తి ఇంట్లో పాములు చెలరేగిపోతూ అతడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాటిని ఇంటి నుంచి తరిమేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పొగపెడితే పత్తా లేకుండా పోతాయని భావించాడు. అనుకున్నదే తడవుగా బొగ్గుతో ఇంట్లో పొగపెట్టాడు.
అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత రాజుకున్న బొగ్గుకు దగ్గరలో ఉన్న మండే స్వభావం కలిగిన వస్తువులు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లోనే ఇల్లంతా పాకి బూడిద చేశాయి. దీంతో లబోదిబోమనడం బాధితుడి వంతైంది. పాముల కోసం పెట్టిన పొగ తన జీవితానికి పొగపెడుతుందని భావించలేకపోయానని బాధితుడు లబోదిబోమన్నాడు.
అయితే, ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే అది కాస్తా కాలిబూడిదైంది. ఇందుకు సంబంధించిన వీడియోను అగ్నిమాపక శాఖ ట్విట్టర్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.