Telangana: తెలంగాణలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. మరింత తగ్గుతాయంటున్న అధికారులు!
- మెదక్ లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
- ఈశాన్య దిక్కు నుంచి వీస్తున్న చలి గాలులే కారణం
- రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈశాన్య దిశ నుంచి రాష్ట్రంలోకి శీతల గాలులు వీస్తున్న నేపథ్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాత్రి మెదక్ లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 14.8 డిగ్రీలు, నిజామాబాద్ లో 17.8, ఖమ్మంలో 19, నల్గొండలో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా... హైదరాబాద్ లో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇదే సమయంలో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రేపు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న ఐదు వారాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వారు వెల్లడించారు.