Samantha: నాగచైతన్యతో విడాకులపై మరోసారి స్పందించిన సమంత.. కలలు, ప్రణాళికలన్నీ పటాపంచలయ్యాయని ఆవేదన
- ఎప్పుడూ భవిష్యత్ అంచనాలు పెట్టుకోనన్న హీరోయిన్
- విడాకులపై అభిమానుల ట్రోల్స్ బాధించాయని విచారం
- ట్రోల్స్ తో గాయం మరింత పెద్దదైందని ఆవేదన
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సమంత–నాగచైతన్య విడాకుల వ్యవహారం షాక్ కలిగించిన సంగతి తెలిసిందే. వారిద్దరి విడాకుల వ్యవహారంపై చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. కొందరు సమంతను టార్గెట్ చేసుకుని ట్రోల్స్ కూడా చేశారు. ఆ విషయంపై సమంత మరోసారి స్పందించింది. ‘ఫిల్మ్ కంపానియన్’ అనే సంస్థతో మాట్లాడుతూ నాటి సంగతులను గుర్తు చేసుకుంది.
ఆ సమయంలో అభిమానుల ఫ్రస్ట్రేషన్ ను తాను అర్థం చేసుకోగలనని, కానీ, ట్రోల్స్ లా కాకుండా మరోలా వారి వారి అభిప్రాయాలను చెబితే బాగుండేదని వ్యాఖ్యానించింది. తన జీవితంలోని ప్రతి సంఘటననూ అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడతానని, ఒకరకంగా అది వారందరినీ తన జీవితంలోకి ఆహ్వానించడమే అవుతుందని చెప్పుకొచ్చింది. అభిమానులు ఆశించినట్టుగా తన నిర్ణయాలు, వ్యాఖ్యలు ఉండకపోవచ్చని, దాని వల్ల వారు అసంతృప్తికి గురై ఉండొచ్చని పేర్కొంది.
‘‘కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వస్తుంటాయి. నా అభిమానుల విషయంలోనూ అంతే. అలాంటి సందర్భాల్లోనే ట్రోల్స్ ఎక్కువవుతాయి. మరి తర్వాతేంటి? నా నిర్ణయాలను అభిమానులు బేషరతుగా ఒప్పుకొంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే, వారంతా ట్రోల్స్ చేయకుండా మరోలా నాతో అభిప్రాయాలను పంచుకుని ఉంటే బాగుండేది’’ అని చెప్పింది.
అభిమానులు ఇంత ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తారని అస్సలు ఊహించలేదని సమంత తెలిపింది. ‘‘నాకేవో అఫైర్లున్నాయని.. పిల్లలు వద్దన్నానని.. అబార్షన్లయ్యాయని.. అవకాశవాదినని.. ఇలా ఎన్నెన్నో కామెంట్లు చేశారు. విడాకులు అనే వ్యవహారమే చాలా బాధాకరమైన అంశం. ఆ బాధ వల్ల కలిగిన గాయాన్ని ఒంటరిగా నయం చేసుకుందామనుకున్నా. కానీ, ఇలా నాపై వ్యక్తిగతంగా దాడి చేయడం వల్ల ఆ గాయం పెరిగింది’’ అంటూ వ్యాఖ్యానించింది.
వచ్చే ఏడాది ఎలాంటి ప్రణాళికలున్నాయన్న ప్రశ్నకు సమంత ఓ నిట్టూర్పు విదిల్చింది. ఈ ఏడాది తన జీవితంలో జరిగిన ఘటనలను చూస్తే.. వచ్చే ఏడాది తన జీవితంలో పెద్దగా అంచనాలేవీ లేవని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళికలు, కన్న కలలన్నీ ఈ ఏడాది పటాపంచలయ్యాయని చెప్పింది. ఇక రాబోయే రోజులకు సంబంధించి తానెలాంటి అంచనాలూ పెట్టుకోనని తెలిపింది. భవిష్యత్ తన కోసం ఏమి తీసుకొస్తే దానిని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది.