Raghu Rama Krishna Raju: పరదాల చాటు నుంచి వరద బాధితులను పరామర్శించిన యోధానుయోధుడు జగన్: రఘురామకృష్ణరాజు
- గతంలో లండన్‌లో కిటికీల ఆధారంగా పన్నులు వేశారు
- జగన్ తన తండ్రిని తిట్టుకునేలా చేస్తున్నారు
- ఎ1, ఎ2లు పదేళ్లుగా కోర్టులకు రావడం లేదు
- అమరావతి రైతుల తరపున మాట్లాడుతుంటే తిడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో లండన్‌లో కిటికీల ఆధారంగా పన్నులు వేశారని, ఇప్పుడు జగన్ కూడా అలానే చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో లే అవుట్లు వేస్తే 5 శాతం భూమి ప్రభుత్వానికి ఇవ్వాలనడం, దానికి 'వైఎస్సార్ లే అవుట్' అని పేరు పెట్టాలనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పరదాల చాటు నుంచి వరద బాధితులను పరామర్శించిన యోధానుయోధుడు జగన్' అంటూ ఎద్దేవా చేశారు. కొందరు కొడుకులు తమ తల్లిదండ్రుల పేర్లు చెడగొట్టేందుకే ఉంటారని, అలాంటి వారిలో జగన్ కూడా ఒకరని అన్నారు. వైఎస్సార్‌ను జనం తిట్టుకునేలా చేస్తున్నారని అన్నారు.
రకరకాల కారణాలతో గత పదేళ్లుగా ఎ1, ఎ2లు కోర్టులకు హాజరుకావడం లేదన్న రఘురామరాజు.. ముఖ్యమంత్రి అయినందున విచారణకు రానంటే ఏ కోర్టూ అంగీకరించదని అన్నారు. ఎ1, ఎ2 మాటలు నమ్మి మోసపోయిన అమరావతి రైతుల గురించి పార్లమెంటులో మాట్లాడుతుంటే అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని రాఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.