Bipin Rawat: బిపిన్ రావత్ మరణం తీవ్ర వేదన కలిగిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi says he deeply anguished by Bipin Rawat death in helicopter crash

  • తమిళనాడులో హెలికాప్టర్ దుర్ఘటన
  • ప్రాణాలు కోల్పోయిన బిపిన్ రావత్ 
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోదీ, రాజ్ నాథ్, అమిత్ షా
  • అత్యంత అంకిత భావంతో సేవలందించారన్న మోదీ

భారత్ లో అత్యంత శక్తిమంతమైన సైనిక పదవిలో ఉన్న జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందించారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ ను కోల్పోవడం తీవ్ర వేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనలో రావత్ అర్ధాంగి, ఇతర సైనిక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారంతా దేశం కోసం అత్యంత అంకితభావంతో సేవలు అందించారని కీర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

జనరల్ బిపిన్ రావత్ సిసలైన సైనికుడు అని, నిజమైన దేశభక్తుడు అని ప్రధాని మోదీ కొనియాడారు. భారత సాయుధ బలగాలను ఆధునికీకరించడంలోనూ, ఆయుధ సంపత్తిని నవీకరించడంలోనూ విశేష సేవలందించారని వెల్లడించారు. వ్యూహాత్మక అంశాల్లో ఆయన ఆలోచనలు, దృక్కోణాలు ఎంతో ఉపయుక్తంగా ఉండేవని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఇక లేరంటే తీవ్ర విషాదం కలుగుతోందని తెలిపారు.

భారత మొట్టమొదటి సీడీఎస్ గా జనరల్ రావత్ సైన్యంలో సంస్కరణలు తీసుకువచ్చారని వెల్లడించారు. సాయుధ బలగాలు ఎదుర్కొంటున్న భిన్న సమస్యలను పరిష్కరించడంలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. సైన్యంలో విశేష సేవలందించి సుసంపన్నమైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. జాతికి ఆయన అందించిన సేవలను దేశం ఎప్పుడూ మర్చిపోదని మోదీ స్పష్టం చేశారు.

అటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బిపిన్ రావత్ దుర్మరణం చెందారన్న సమాచారంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. రావత్ కన్నుమూత పట్ల అమిత్ షా ప్రగాఢ సంతాపం వ్యక్తపరిచారు.

  • Loading...

More Telugu News