Uttam Kumar Reddy: రైతుల ఆత్మహత్యలకు కేంద్ర వైఫల్యం కూడా కారణమేనన్న ఉత్తమ్.... తప్పంతా టీఆర్ఎస్ సర్కారుదేనన్న కేంద్రం
- రాజకీయ దుమారం రేపుతున్న ధాన్యం సేకరణ
- లోక్ సభలో ప్రశ్నించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
- రైతులు ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన
- తెలంగాణ ప్రభుత్వమే జాప్యం చేస్తోందన్న పియూష్ గోయల్
తెలంగాణలో ధాన్యం కొనుగోలు జరగక రైతులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో నేడు ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. ఆహార భద్రత, పోషకాహార లోపం అంశాలపై లోక్ సభలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం సేకరణ అంశంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్టోబరు నుంచి మార్కెట్ కు ధాన్యం వస్తోందని, అయితే అందులో సగం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) సేకరించలేదని అన్నారు. ఎఫ్ సీఐ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు కుదుర్చుకున్న ఒప్పందం ఏమైందని ఉత్తమ్ ప్రశ్నించారు.
దీనికి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ బదులిచ్చారు. ధాన్యం సేకరణ అంశంలో తమ తప్పేమీలేదని, తెలంగాణ ప్రభుత్వమే జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఒప్పందం ప్రకారం తెలంగాణ సర్కారు రైతుల నుంచి ధాన్యం సేకరించి బియ్యంగా మార్చి కేంద్రానికి అందించాల్సి ఉందని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని, అనేక పర్యాయాలు కాలపరిమితిని పొడిగించినా ప్రయోజనం లేకపోయిందని పియూష్ గోయల్ వివరించారు.