Bipin Rawat: జనరల్ బిపిన్ రావత్ మరణంపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan responds on CDS General Bipin Rawad death

  • తమిళనాడులో కుప్పకూలిన వాయుసేన హెలికాప్టర్
  • బిపిన్ రావత్ దంపతుల సహా 13 మంది మృతి
  • అత్యంత బాధాకరమన్న పవన్
  • సాయితేజ మృతి కలచివేసిందని వ్యాఖ్య  

భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మన దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. రావత్, ఆయన అర్ధాంగి మధులికతో పాటు మరో 11 మంది దుర్మరణం పాలైన ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

అత్యున్నత సీడీఎస్ బాధ్యతలను అందుకున్న తొలి అధికారిగా బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం అని వివరించారు. త్రివిధ దళాలను సమన్వయ పరిచి దేశ రక్షణ వ్యవస్థలను పటిష్ఠపరిచే కీలక బాధ్యతల్లో ఉన్న రావత్ మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ కూడా ఉన్నాడని తెలిసి బాధపడ్డానని పవన్ కల్యాణ్ అన్నారు.

మృతుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కోలుకోవాలని కోరుకుంటున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News