China: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌పై నీలినీడలు.. దౌత్య బహిష్కరణ జాబితాలో ఐదు దేశాలు

Canada joins US and allies in Beijing Olympics boycott
  • ఇప్పటికే అమెరికా, బ్రిటన్ సహా నాలుగు దేశాలు
  • మానవహక్కుల ఉల్లంఘన, ప్రభుత్వ తీరుకు నిరసనగానేనన్న కెనడా
  • రేపో, మాపో ఫ్రాన్స్ కూడా నిర్ణయం
చైనా రాజధాని బీజింగ్‌లో వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మానవహక్కుల ఉల్లంఘన వంటి ఆరోపణలపై గుర్రుగా ఉన్న పలు దేశాలు వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నాయి.

ఈ విషయంలో ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, లిథువేనియా ఇలాంటి నిర్ణయమే తీసుకోగా, తాజాగా కెనడా కూడా ఆ దేశాల బాటలోనే నడిచింది. మానవ హక్కుల ఉల్లంఘన, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో తెలిపారు.

బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో తమ దేశం తరపున అధికారులు కానీ, రాయబారులు కానీ పాల్గొనబోరని స్పష్టం చేశారు. అయితే, క్రీడాకారులు మాత్రం పాల్గొంటారని తెలిపారు. ఈ విషయాన్ని గత నాలుగు నెలలుగా పరిశీలిస్తున్నామని, భాగస్వామ్య దేశాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

ఇక కెనడా తాజా నిర్ణయంతో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన దేశాల సంఖ్య ఐదుకు పెరిగింది. కాగా, ఈ విషయంలో తాము కూడా త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ఫ్రాన్స్ తెలిపింది.
China
Beijing
Winter Olympics
Boycott

More Telugu News