Vizag: విశాఖ నగరంలో 'స్నో పార్కు' ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం!
- గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
- 2 ఎకరాల్లో రూ.20 కోట్ల అంచనా వ్యయం
- స్థలం కోసం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారుల అన్వేషణ
- ఎన్నో ప్రత్యేకతలతో స్నో పార్కు
మంచు పర్వతాలను ఎక్కుతూ మంచులో ఆటలు ఆడుకోవాలని భావించే వారికి ఆ అనుభూతిని విశాఖ నగరంలోనే అందించేలా స్నో పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ పార్కును గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 ఎకరాల్లో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తారు.
ఇందుకుగాను స్థలం కోసం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో ఈ స్నో పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంచులో బాస్కెట్‌బాల్ ఆట ఆడుకునేలా సౌకర్యాలు కల్పించడంతో పాటు హోటల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఇక్కడ మంచు పర్వతారోహణ ఏర్పాట్లు కూడా చేస్తారు. కమ్మని పాటలు వింటూ మంచులో ఆడుకోవచ్చు. ఈ పార్కు ఏర్పాటు కోసం డీపీఆర్ తయారుచేయడానికి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్నో పార్కును అన్ని విధాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. చిన్నపాటి కృత్రిమ మంచు పర్వతాలను కూడా ఈ పార్కులో ఏర్పాటు చేస్తారు.
దీంతో మంచు పర్వతారోహణ అనుభవాన్ని పొందొచ్చు. సినిమా షూటింగ్‌లూ చేసుకునేలా దీన్ని తీర్చిదిద్దుతారు. ఈ పార్కును విశాఖ బీచ్ రోడ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. పార్క్ హోటల్ పక్కన ఉన్న వీఎంఆర్‌డీఏ స్థలంలో ఏర్పాటు చేసే అంశాన్నీ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ పార్కును దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్కు ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నామని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు కూడా మీడియాకు తెలిపారు. విశాఖలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.