Farmers: రైతుల చారిత్రాత్మక విజయం.. అన్ని డిమాండ్లకు కేంద్రం ఓకే.. ఉద్యమానికి ఇక సెలవు!

Farmers call off year long stir after govt assurances
  • రైతుల డిమాండ్లకు లిఖిత పూర్వక హామీ
  • కనీస మద్దతు ధరపై కమిటీ
  • రైతులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేత
  • ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం
  • రేపటి నుంచి విజయ కవాతుతో స్వస్థలాలకు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా 15 నెలలకుపైగా ఉద్యమం చేస్తున్న రైతులు ఎట్టకేలకు తమ పోరును ముగించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు. దీంతో ఉద్యమం ఆగుతుందని భావించారు. అయితే, తమ మిగిలిన డిమాండ్లను కూడా నెరవేరిస్తే తప్ప ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో రైతుల మిగిలిన డిమాండ్లను నెరవేర్చేందుకు కూడా కేంద్రం ఓకే చెప్పింది. ఈ మేరకు లిఖిత పూర్వక హామీ ఇచ్చింది.

రైతులు డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటుతోపాటు వారిపై నమోదైన కేసుల ఎత్తివేత, ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇందుకు సంబంధించిన హామీ పత్రం రైతులకు అందడంతో ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నిన్న ప్రకటించింది.

దీంతో, ఢిల్లీలోని తమ నిరసన శిబిరాలను రైతులు రేపటి నుంచి ఖాళీ చేసి ఇంటిముఖం పట్టనున్నారు. ఇందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని రైతు నేత రాకేశ్ టికాయత్ తెలిపారు. అయితే, హామీలను నెరవేర్చకుంటే కనుక మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

రైతులు రేపటి నుంచి విజయ కవాతుతో స్వస్థలాలకు చేరతారని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ పేర్కొన్నారు. రైతులు చారిత్రాత్మక విజయం సాధించారన్నారు. మరో నేత శివకుమార్ కక్కా మాట్లాడుతూ.. నిరసనల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు క్షమాపణలు తెలిపారు.
Farmers
Farm Laws
Union Government
Rakesh Tikait

More Telugu News