Jagan: ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసు.. నలుగురు టీడీపీ మహిళా నేతలకు ముందస్తు బెయిలు
- అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసుల నమోదు
- హైకోర్టును ఆశ్రయించిన నేతలు
- పిటిషనర్ల ఇళ్లపై సోదాలు ఎందుకు చేశారని హైకోర్టు ప్రశ్న
- నివేదిక ఇవ్వాలంటూ ఎస్పీకి ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అనంతపురంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో నలుగురు టీడీపీ మహిళా నేతలపై కేసు నమోదైంది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో .. జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మహిళా నేతలు టి. స్వప్న, పి.విజయశ్రీ, కేసీ జానకి, ఎస్ తేజస్వినిపై అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
దీంతో వారు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వారికి ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా వారి ఇళ్లపై పోలీసులు దాడులు చేసి, సోదాలు నిర్వహించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఆ అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. దీనిపై తమకు పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలంటూ అనంతపురం జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.