Ravi Shastri: రోహిత్ శర్మ, కోహ్లీ కెప్టెన్సీలపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందన!

Former India Head Coach Ravi Shastri Views On Rohit Sharmas Captaincy

  • జట్టు అవసరాలకు తగ్గట్టుగా రోహిత్ ఆడతాడు
  • అన్ని వనరులను ఉపయోగించుకోవడంలో రోహిత్ దిట్ట
  • కోహ్లీ ఒక తెలివైన కెప్టెన్

ఇటీవలే టీ20 కెప్టెన్సీ పగ్గాలను చేపట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు వన్డే నాయకత్వ బాధ్యతలను బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే. రోహిత్ తో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి కొన్నేళ్లుగా అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ గురించి రవిశాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. రోహిత్ తన కోసం మితిమీరి ఆడే ప్రయత్నం చేయడని... టీమ్ అవసరాలకు తగ్గట్టుగా ఆడటం ఆయన గొప్పదనమని కితాబునిచ్చారు. జట్టులో ఉన్న అన్ని వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడంలో రోహిత్ దిట్ట అని అన్నారు.

కోహ్లీ గురించి మాట్లాడుతూ ఆయనొక తెలివైన కెప్టెన్ అని చెప్పారు. అయితే కెప్టెన్ గా జట్టు సాధించిన విజయాలను మాత్రమే జనం పట్టించుకుంటారని...  నీవు ఎన్ని పరుగులు చేశావు, ఎలా పరుగులు చేశావనే విషయం వారికి అనవసరమని శాస్త్రి తెలిపారు. కోహ్లీ చాలా గొప్పగా ఎదిగాడని, ఎంతో మెచ్యూరిటీ ఉన్న ఆటగాడని కితాబునిచ్చారు. ఇండియా టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించడం అంత సులభమైన విషయం కాదని అన్నారు. కెప్టెన్ గా సాధించిన దానికి కోహ్లీ ఎంతో గర్వపడాలని చెప్పారు.

ఇక వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నాడు. వన్డే కెప్టెన్ గా రోహిత్ ను నియమిస్తున్నట్టు బుధవారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ ఇప్పటికే 32 లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు. వీటిలో 26 మ్యాచ్ లను గెలిపించిన ఘనత ఆయన సొంతం. రోహిత్ నాయకత్వంలోనే టీమిండియా అంతర్జాతీయ టోర్నీలైన నిదహాస్ ట్రోఫీ, 2018 ఆసియా కప్ లను గెలుపొందింది. ఐపీఎల్ లో కూడా అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ కు పేరుంది.

  • Loading...

More Telugu News