Virat Kohli: ఈ కారణం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించారు: మాజీ సెలెక్టర్ సబా కరీమ్
- 2017లో కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలను స్వీకరించాడు
- కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా నాలుగు ఐసీసీ టోర్నీలను ఆడింది
- ఈ నాలుగు టోర్నీల్లో భారత్ ఒక్కటి కూడా గెలవలేదు
దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్తున్న టీమిండియా జట్టు వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించింది. దీంతో టీ20, వన్డేలకు పూర్తి స్థాయి కెప్టెన్ గా రోహిత్ ప్రమోట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కేవలం టెస్టు కెప్టెన్ గా మాత్రమే కొనసాగనున్నాడు. మరోపక్క, వన్డే కెప్టెన్ గా కోహ్లీని తొలగించడంపై ఆయన అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై పలువురు మాజీలు వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్, 2012లో టీమిండియా సెలెక్టర్ గా ఉన్న సబా కరీమ్ ఈ అంశంపై స్పందించారు.
గత నాలుగేళ్ల కాలంలో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయిందని... ఈ కారణం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించారని సబా కరీమ్ అన్నారు. 2017లో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారని చెప్పారు. కోహ్లీ కెప్టెన్ గా భారత్ నాలుగు ఐసీసీ టోర్నీలను ఆడిందని... వీటిలో రెండు టోర్నీల్లో ఫైనల్స్ లో ఓడిపోయామని, ఒక్క టోర్నీలో సెమీస్ లో వెనుదిరిగామని తెలిపారు. ఒక్క టోర్నీని కూడా గెలవకపోవడం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారని అన్నారు.