Manavedra Singh: దేశంలో అత్యంత అనుభవజ్ఞుడైన హెలికాప్టర్ పైలెట్ కు రావత్ ప్రమాద ఘటన దర్యాప్తు బాధ్యతల అప్పగింత
- తమిళనాడులోని నీలగిరి వద్ద హెలికాప్టర్ ప్రమాదం
- సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది మృత్యువాత
- మృతుల్లో రావత్ అర్ధాంగి మధులిక
- దర్యాప్తుపై పార్లమెంటులో ప్రకటన చేసిన రాజ్ నాథ్
సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన అర్ధాంగి మధులిక సహా 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం యావత్ దేశానికి ఇప్పటికీ దిగ్భ్రాంతికరంగానే ఉంది. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ క్రమంలో తమిళనాడులోని నీలగిరి కొండల్లో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన దర్యాప్తు బాధ్యతలను దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన హెలికాప్టర్ పైలెట్ ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ కు అప్పగిస్తున్నట్టు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై వాయుసేన దర్యాప్తుకు ఆదేశించిందని, ఈ త్రివిధ దళాల దర్యాప్తు బృందానికి ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నాయకత్వం వహిస్తారని రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటించారు.
ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ప్రస్తుతం ట్రైనింగ్ కమాండ్ కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. భారత వాయుసేనలో అత్యంత అనుభవజ్ఞుడైన హెలికాప్టర్ పైలెట్ మానవేంద్ర సింగ్ ఒక్కరే. హెలికాప్టర్ పైలెట్ గా భారత వాయుసేనలో ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. సీడీఎస్ బిపిన్ రావత్ ను బలిగొన్న హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను తనకున్న అపార అనుభవంతో మానవేంద్ర సింగ్ వెలికి తీస్తారని కేంద్రం భావిస్తోంది. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేసి తగిన కారణాలను వెల్లడిస్తారని ఉభయ సభల్లో రాజ్ నాథ్ ప్రకటించారు.
రావత్ ప్రమాద ఘటనకు హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలా? లేక ప్రతికూల వాతావరణమా? అన్నది విచారణ అనంతరం తెలియనుంది. ఇప్పటికే ఘటన స్థలి నుంచి బ్లాక్ బాక్స్ ను సేకరించిన అధికారులు దాన్ని విశ్లేషించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.