Nandigam Suresh: సాయం చేయమన్నందుకు చేయి చేసుకున్నారు.. ఎంపీ నందిగం సురేశ్‌పై డిస్మిస్డ్ కానిస్టేబుల్ ఫిర్యాదు

suspended constable alleges life threat from mp nandigam suresh

  • ఇంటికి పిలిచి పోలీసులు, ఎంపీ, ఆయన అనుచరులు దాడిచేశారు
  • భార్య, పిల్లలను పిలిచి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు
  • తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు
  • ఎంపీ నుంచి నాకు ప్రాణహాని ఉంది
  • రక్షణ కల్పించాలంటూ గుంటూరు ఎస్పీకి వినతిపత్రం

సస్పెండ్ చేసిన తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరినందుకు ఎంపీ నందిగం సురేశ్ తనపై చేయి చేసుకున్నారని, కులం పేరుతో దూషించారని డిస్మిస్ అయిన కానిస్టేబుల్ బత్తుల బాబూరావు ఆరోపించారు. ఆయన నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ గుంటూరు ఎస్పీకి వినపతిపత్రం అందించారు.

అయితే, ఈ ఆరోపణలను ఎంపీ సురేశ్ ఖండించారు. తాను అతడిపై చేయి చేసుకోలేదని వివరణ ఇచ్చారు. అసలు అతడెవరో కూడా తనకు తెలియదని అన్నారు. సాయం కోరుతూ పదేపదే విసిగించాడని పేర్కొన్నారు. మరో నంబరుతో ఫోన్ చేసి ఆడియో రికార్డును ఎవరివద్ద పెట్టాలో వారి వద్ద పెడతానని హెచ్చరించడంతో తన పీఏ ద్వారా ఫిర్యాదు చేయించినట్టు వివరించారు.

బాబూరావు మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగా మూడేళ్లుగా విధులకు హాజరు కాలేకపోయానని, దీంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయాడు. తిరిగి తనను విధుల్లోకి తీసుకునేందుకు సాయం చేయాలని ఎంపీని కోరితే తనపై చేయిచేసుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఢిల్లీలో ఉన్న ఎంపీకి ఎస్ఎంఎస్ ఇచ్చి ఫోన్ చేసి అడిగినందుకు దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశాడు.  

ఈ నెల 7న అర్ధరాత్రి వేళ తుళ్లూరు పోలీసులు తనను ఎంపీ ఇంటికి తీసుకెళ్లారని, ఎంపీ, ఆయన అనుచరులు, తుళ్లూరు ఎస్సై తనను కొట్టి ఫోన్ లాగేసుకున్నారని, అందులోని ఆడియో, వీడియో రికార్డులను తొలగించారని బాబూరావు ఆరోపించాడు. తన భార్య, కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని, 8వ తేదీ అర్ధరాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచి తెల్లకాగితాలపై సంతకం తీసుకున్నారని ఆరోపించాడు.

ఎంపీ నందిగం నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ నిన్న గుంటూరు ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించాడు. బాబూరావు ఆరోపణలపై స్పందించిన పోలీసులు.. తాము ఆయనపై చేయి చేసుకోలేదని, ఎంపీకి ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారన్న ఎంపీ పీఏ ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్టు తెలిపారు. తాము పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాం తప్పితే చేయిచేసుకోలేదని తుళ్లూరు  డీఎస్పీ పోతురాజు తెలిపారు.

  • Loading...

More Telugu News