Tollywood: రెండు ఆటం బాంబులు దొరికాయనుకున్నా: రాజమౌళి
- కేవలం ఐదు భాషల్లోనే సినిమా విడుదల
- ఇది కేవలం కల్పిత కథాంశమే
- స్నేహం బ్యాగ్రౌండ్ లో సాగుతుంది
- దేశభక్తి అండర్ గ్రౌండ్ లో నడుస్తుంది
ప్రస్తుతం థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ఓ ఊపు ఊపేస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణపై చిత్ర యూనిట్ ఇవాళ కృతజ్ఞతలు తెలిపింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, అలియా భట్, నిర్మాత డీవీవీ దానయ్యలు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పలు సంగతులను పంచుకున్నారు. వేరేచోట సినిమా షూటింగ్ ఉన్నా అలియా కేవలం ప్రెస్ మీట్ కోసమే ఇక్కడకు వచ్చిందని పేర్కొంటూ, రాజమౌళి ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు.
సినిమా కోసం తాను షూట్ చేసిన మొదటి సీన్.. తారక్–చరణ్ లు బైక్ పై వచ్చే సన్నివేశమేనని తెలిపారు. వారిద్దరి హావభావాలు, ప్రవర్తన, మాటలను బట్టి.. ఆన్ స్క్రీన్ లో వారి జోడీ బాగుంటుందని ఫిక్స్ అయినట్టు చెప్పారు. కచ్చితంగా అదో బంపర్ హిట్ కాంబో అవుతుందనుకున్నానన్నారు. సినిమా పది భాషల్లో రిలీజ్ అవుతుందన్న ఊహాగానాల మధ్య జక్కన్న క్లారిటీ ఇచ్చారు. కేవలం ఐదు భాషల్లోనే విడుదల చేస్తున్నామని చెప్పారు. తెలుగు తప్ప.. వేరే భాషల్లో డబ్బింగ్ జరుగుతోందని తెలిపారు.
కరోనా ఒక్కరికే వచ్చిన ప్రమాదం కాదని, ప్రపంచం మొత్తానికీ వచ్చిన ప్రమాదమని రాజమౌళి అన్నారు. ఎంతో మంది చనిపోతుంటే చాలా భయపడ్డానన్నారు. ఇప్పటివరకు పరుగెత్తింది చాలు.. కాస్త నెమ్మదించు అని ప్రకృతి చెప్పినట్టుందన్నారు. కరోనాతో ఇంట్లో ఉండడమూ కాస్త బాగుందనిపించిందని, ఫ్యామిలీతో ఎంజాయ్ చేశానని తెలిపారు. కరోనాతో ప్రపంచం మొత్తం ఆగిపోయిందని, అన్ని సినిమాలూ ఆగాయని, అందులో ఆర్ఆర్ఆర్ ఒకటని చెప్పారు. అది జస్ట్ చిన్న పాజ్ మాత్రమేనన్నారు.
ఇది దేశభక్తి సినిమా కాదని, స్నేహం నేపథ్యంలో సాగే చిత్రమని రాజమౌళి స్పష్టం చేశారు. అంతర్లీనంగా దేశభక్తి కథగా సాగుతుందన్నారు. సినిమా అంతా కల్పితమేనన్నారు. పునర్జన్మల ప్రస్తావనేదీ లేదని తేల్చి చెప్పారు. కొమురం భీం కథ కోసం వారి కుటుంబాలను తాను కలవలేదని రాజమౌళి చెప్పారు.
95 శాతం సినిమా ఢిల్లీ చుట్టూనే తిరుగుతుందన్నారు. నిజాం పరిపాలన వల్ల అప్పటి గోండు సామ్రాజ్యంలోని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, అలాంటి వర్గానికి చెందిన వ్యక్తి నగరానికి వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే కల్పిత పాత్రను పెట్టామన్నారు. అల్లూరి సీతారామరాజు విషయంలోనూ అదే జరిగిందని చెప్పారు.
ఓ రోజు తారక్, చరణ్ లకు ఫోన్ చేసి రమ్మన్నానని, ముందుగా తారక్ వచ్చాడని చెప్పారు. ఆ తర్వాత చరణ్ వచ్చాడన్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని షాకయ్యారన్నారు. అప్పుడే ఇద్దరితో కలిసి సినిమా చేద్దామనుకుంటున్నానని వారికి చెప్పానన్నారు. వాళ్లిచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ను ఇప్పటికీ మరువలేనన్నారు. అప్పుడే సోఫాలో కూర్చున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నామని తెలిపారు. రెండు ఆటంబాంబులు దొరికాయని ఫీలయ్యానని రాజమౌళి అన్నారు. 'నాటు నాటు' పాటలోనూ ఓ ఎమోషన్ ఉంటుందని, అది సినిమాలో కనిపిస్తుందని, ప్రతి ఒక్కరూ దానికి కనెక్ట్ అవుతారని తెలిపారు.