Virat Kohli: కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై తీవ్రస్థాయిలో స్పందించిన చిన్ననాటి కోచ్
- ఇటీవలే టీ20 కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ
- వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించిన సెలెక్టర్లు
- కోహ్లీ వన్డేల్లో విజయవంతమైన కెప్టెన్ అన్న కోచ్
- గంగూలీ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని వ్యాఖ్య
ప్రపంచ మేటి బ్యాట్స్ మన్లలో ఒకడిగా ఖ్యాతిపొందిన విరాట్ కోహ్లీని టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఈ అంశంలో తీవ్రంగా స్పందించారు. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారన్నది సెలెక్టర్లు అసలు ఇంతవరకు చెప్పలేదని ఆరోపించారు. జట్టు యాజమాన్యం కానీ, బీసీసీఐ కానీ ఏం కోరుకుంటోందో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. 'కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను లాగేసుకోవడంపై స్పష్టత లేదు, పారదర్శకత ఏమాత్రం లేదు' అని రాజ్ కుమార్ శర్మ విమర్శించారు.
కోహ్లీ వన్డేల్లో విజయవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నాడని, కానీ అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం విచారకరమని పేర్కొన్నారు. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని బీసీసీఐ కోహ్లీకి సూచించిందని గంగూలీ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందని రాజ్ కుమార్ శర్మ వెల్లడించారు. ఈ వ్యవహారాలపై తాను ఇప్పటివరకు కోహ్లీతో మాట్లాడలేదని, కొన్ని కారణాల వల్ల ఫోన్ స్విచాఫ్ చేసినట్టుందని చెప్పారు.