Chandrababu: నెల్లూరు టీడీపీ నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు
- నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి
- నెల్లూరు నేతలతో చంద్రబాబు సమీక్ష
- ఇద్దరు నేతలు కోవర్టుగా పనిచేశారంటూ ఆగ్రహం
- కుమ్మక్కు రాజకీయాలు ఇక సాగవని హెచ్చరిక
టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇటీవల నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి కారకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు నేతలను సస్పెండ్ చేశారు. వారు కార్పొరేషన్ ఎన్నికల్లో కోవర్టులుగా వ్యవహరించారని మండిపడ్డారు.
ఈ క్రమంలో నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలనన్నిటినీ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చాక మరికొందరిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. త్వరలో నెల్లూరు నగర టీడీపీకి కొత్త కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. టీడీపీలో ఇకపై కుమ్మక్కు రాజకీయాలు సాగవని స్పష్టం చేశారు. కోవర్టులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు అవసరంలేదని తేల్చి చెప్పారు.
అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత నాయకులపై లేదా? అని పార్టీ సమావేశంలో ప్రశ్నించారు. పార్టీని ఏ విధంగా పటిష్ఠం చేయాలో తనకు తెలుసని, టీడీపీలోకి యువరక్తాన్ని తీసుకువస్తానని ఉద్ఘాటించారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేసేవారికే ఇకపై పార్టీ పదవులు లభిస్తాయని స్పష్టం చేశారు.