Cow: కర్ణాటకలో బంగారు గొలుసు మింగేసిన ఆవు... శస్త్రచికిత్స చేయించిన యజమాని

Cow swallows gold chain in Karnataka

  • కర్ణాటకలోని హీపనహళ్లిలో ఘటన
  • దీపావళి సందర్భంగా గోపూజ
  • దూడ మెడలో బంగారు గొలుసు వేసిన వైనం
  • కాసేపటి తర్వాత గొలుసు మాయం
  • మెటల్ డిటెక్టర్ సాయంతో గొలుసు గుర్తింపు

కర్ణాటకలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఉత్తర కర్ణాటకలోని సిర్సి తాలూకాలోని హీపనహళ్లిలో శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. వారికి నాలుగేళ్ల వయసున్న ఓ ఆవు, దూడ ఉన్నాయి. ఇటీవల దీపావళి సందర్భంగా శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు గోపూజ నిర్వహించారు. ఆ గోమాతను, దాని దూడను శుభ్రంగా కడిగి అందంగా ముస్తాబు చేశారు. దూడ మెడలో పూలదండతో పాటు బంగారు గొలుసు కూడా వేశారు.

ఇక పూజ పూర్తయిన తర్వాత పూలదండతో పాటు గోల్డ్ చెయిన్ కూడా తీసేసి పక్కనపెట్టారు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూసేసరికి అక్కడ ఉండాల్సిన బంగారు చెయిన్ కనిపించలేదు. అక్కడున్న పూలదండ కూడా కనిపించలేదు. దాంతో ఆ ఆవు కానీ, దాని దూడ కానీ పూలతో సహా బంగార గొలుసును కూడా మింగేసి ఉంటాయని భావించారు. అప్పటి నుంచి శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు వాటి పేడలో ఏమైనా గొలుసు పడుతుందేమోనని ప్రతి రోజూ గమనించేవారు. ఎంతకీ గొలుసు కనిపించకపోవడంతో స్థానిక పశువైద్యుడి సేవలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆ వెటర్నరీ డాక్టర్ ఓ మెటల్ డిటెక్టర్ సాయంతో ఆవు పొట్టలో బంగారు గొలుసు ఉన్నట్టు గుర్తించాడు. ఆ తర్వాత ఆవు పొట్టకు స్కానింగ్ చేయగా, ఆ గొలుసు కచ్చితంగా ఎక్కడ ఉందో ఆ స్పాట్ వెల్లడైంది. ఇక ఆ కుటుంబం విజ్ఞప్తి మేరకు సదరు డాక్టర్ ఆవుకు ఆపరేషన్ నిర్వహించి, బంగారు గొలుసును వెలికి తీశాడు.

ఆ గొలుసు బరువు 20 గ్రాములు అయితే, ఆవు పొట్ట నుంచి బయటికి వచ్చాక 18 గ్రాములే తూగుతోందట. గొలుసులోని కొంతభాగం ఆవు పొట్టలోనే ఉండిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ గోవు కోలుకుంటోందట.

  • Loading...

More Telugu News