Australia: కరోనా ఆంక్షల కారణంగా న్యూజిలాండ్‌లో చిక్కుకుపోయిన శునకం.. రప్పించేందుకు లక్షలాది రూపాయలతో ప్రైవేట్ జెట్ ఏర్పాటు!
- ఇండోనేషియాలోని బాలిలో ఐదేళ్ల క్రితం వీధి శునకాన్ని దత్తత తీసుకున్న దంపతులు
- ‘మంచ్‌కిన్’ను ఆస్ట్రేలియా తీసుకొచ్చేందుకు ఇప్పటికే వేలాది డాలర్ల ఖర్చు
- ఇప్పుడు రూ. 24 లక్షల ఖర్చుతో ప్రైవేటు జెట్
- అందులోని నాలుగు సీట్లను విక్రయించడం ద్వారా ఖర్చు తగ్గించుకునే ప్లాన్
ఆస్ట్రేలియా దంపతులు ఇండోనేషియాలోని బాలిలో దత్తత తీసుకున్న శునకం కరోనా ఆంక్షల కారణంగా న్యూజిలాండ్‌లో చిక్కుకుపోయింది. దీంతో ఈ క్రిస్మస్ నాటికి దానిని ఎలాగైనా తమవద్దకు రప్పించుకోవాలని నిర్ణయించుకున్న ఆ దంపతులు ఏకంగా ప్రైవేట్ జెట్ విమానాన్ని అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు ఉండడంతో ‘మంచ్‌కిన్’ అనే మాజీ బాలి వీధి శునకం న్యూజిలాండ్‌లో చిక్కుకుపోయి యజమానులను చేరలేక ఐదు నెలలుగా అవస్థలు పడుతోంది. ఈ ఎడబాటును భరించలేని ఆస్ట్రేలియాలోని సన్‌షైన్ కోస్టుకు చెందిన టాష్ కార్బిన్-డేవిడ్ డేన్స్ దంపతులు దానిని ఎలాగైనా తిరిగి తన వద్దకు రప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 32 వేల అమెరికన్ డాలర్ల (దాదాపు రూ. 24 లక్షలు) ఖర్చుతో ప్రైవేట్ జెట్ విమానాన్ని అద్దెకు తీసుకున్నారు.
ఇక్కడ డబ్బు సమస్య కానేకాదని, క్రిస్మస్ పండుగకు ముందే అది తమ చెంతకు చేరుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కార్బిన్ తెలిపారు. అయితే, ఖర్చును తగ్గించుకునేందుకు జెట్‌లోని మిగిలిన నాలుగు సీట్లను ప్రయాణికులకు విక్రయించాలని ఈ జంట భావిస్తోంది. ఇది కనుక విజయవంతమైతే ఇండోనేషియాలోని బాలి ద్వీపం నుంచి మంచ్‌కిన్‌ను తీసుకొచ్చేందుకు చేసిన ఐదేళ్లగా చేస్తున్న ప్రయత్నంలో ఇదే చివరి దశ అవుతుందని దంపతులు వివరించారు. ఈ జంట బాలిలో ఈ వీధి శునకాన్ని దత్తత తీసుకుంది.
పెంపుడు జంతువుల దిగుమతిపై ఆస్ట్రేలియాలో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వైద్య పరీక్షల్లో మంచ్‌కిన్ విఫలమైన తర్వాత దానిని సింగపూర్‌లో వివిధ పెంపుడు కుక్కలతో కలిసి మూడేళ్లు ఉంచినట్టు కార్బిన్ తెలిపారు. 2019లో మంచ్‌కిన్‌ను తీసుకొచ్చేందుకు న్యూజిలాండ్ అంగీకరించడంతో డేన్స్ సింగపూర్ వెళ్లి శునకాన్ని న్యూజిలాండ్ తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా ఆమోదించే వరకు దానిని అక్కడే ఉంచాలని నిర్ణయించుకున్నారు. అయితే, శునకానికి నిర్వహించిన వైద్య పరీక్షల తర్వాత దానిని ఆస్ట్రేలియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో డేన్స్ తిరిగి ఒంటరిగా ఆస్ట్రేలియా చేరుకున్నారు.
శునకాన్ని ఆస్ట్రేలియాకు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాల్లో ఇప్పటికే చాలా డబ్బును ఖర్చు చేయాల్సి వచ్చిందని కార్బిన్ తెలిపారు. అందుకనే ఈ శునకానికి ‘మిలియన్ డాలర్ మంచ్‌కిన్’ అని నామకరణం చేసినట్టు చెప్పారు.
మూడేళ్ల క్రితం ఖర్చు 40 వేల డాలర్లకు చేరుకోవడంతో అప్పటి నుంచి లెక్కపెట్టడం మానేశామని తెలిపారు. అయితే, ఇంత ఖర్చు అవుతుందని కానీ, ఇంత సమయం పడుతుందని కానీ తాము ఆలోచించలేకపోయామని కార్బిన్ తెలిపారు. ఎట్టకేలకు ఇప్పుడు శునకం తమ చెంతకు చేరుకుంటుండడంతో సంతోషంగా ఉందన్నారు.