Nadendla Manohar: తెలంగాణ ఎంపీలు చేసిన పనిని ఏపీ ఎంపీలు ఎందుకు చేయలేకపోతున్నారు?: నాదెండ్ల
- ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ఎంపీలు పోరాడారు
- పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు
- ఏపీలో 25 మంది ఎంపీలు ఉన్నారు
- విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎందుకు పోరాడట్లే?
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో బలంగా పోరాడారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మరి ఏపీలోని 25 మంది ఎంపీలు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని ఆయన నిలదీశారు. అందరూ కలిసికట్టుగా నిలబడి పోరాడాలని ఆయన చెప్పారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కొనసాగుతున్న పోరాటంలో భాగంగా మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. కేరళలోని త్రివేండ్రం విమానాశ్రయాన్ని ప్రయివేటీకరిస్తామనగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రతిపక్ష కాంగ్రెస్ ను కలుపుకుని పోరాడారని, ప్రభుత్వ రంగంలో కొనసాగేలా చేశారని ఆయన చెప్పారు.
మరి ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు ప్రతిక్షాలను కలుపుకుని పోరాడడం లేదని ఆయన నిలదీశారు. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారని, వారందరు కలిసి ఎందుకు ప్రధాని మోదీని కలిసి ప్రయివేటీకరణ గురించి మాట్లాడటం లేదు? అని ఆయన ప్రశ్నించారు.
ఏపీ సీఎం అఖిలపక్షం ఏర్పాటు చేసి ఆహ్వానించాలని, ఈ పోరాటంలో దిగాలని పవన్ కల్యాణ్ కోరితే ఇప్పటివరకు ఆయన స్పందించలేదని ఆయన అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడదామని పవన్ కల్యాణ్ చెప్పారని అన్నారు.
ఏపీలో ఎందుకు రాజధాని లేదని ఆయన నిలదీశారు. పెట్టుబడులు ఎందుకు రావట్లేవని పవన్ కల్యాణ్ మొదటి నుంచి నిలదీస్తున్నారని చెప్పారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయకూడదని చెప్పారు. ఇంత భారీ మెజార్టీ ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు పోరాటానికి వెనకాడుతోందని ఆయన ప్రశ్నించారు.
విశాఖ సభకు లక్షలాది మంది ప్రజలు వచ్చారని జనసేనానికి మద్దతు తెలిపారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెద్ద మనసుతో ఆలోచించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.