Pawan Kalyan: నా సినిమాలు ఆపేస్తే భయపడతా అనుకుంటున్నారా... ఏపీలో ఉచితంగా సినిమా షోలు వేస్తా: పవన్ కల్యాణ్
- మంగళగిరిలో పవన్ ఒక్కరోజు దీక్ష
- విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం
- తన ఆర్థికమూలాలు దెబ్బతీయాలనుకుంటున్నారని ఆరోపణ
- భయపడబోనని స్పష్టీకరణ
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఒక్క రోజు దీక్ష చేపట్టారు. నిమ్మరసం స్వీకరించిన అనంతరం దీక్ష ముగించారు. ఈ క్రమంలో సభకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తన సినిమాలు ఆపేస్తే, ఏపీలో ఉచితంగా సినిమా షోలు వేస్తానని వెల్లడించారు. అంతేతప్ప బెదిరింపులకు భయపడేవాడ్ని కాదని స్పష్టం చేశారు.
"నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థికమూలాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు. వాళ్లు అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తా" అని వెల్లడించారు. "సినిమా టికెట్ల అంశంలో పారదర్శకత లేదని చెబుతున్నారు... మీకుందా పారదర్శకత? మీకంత పారదర్శకత ఉంటే ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? అని ప్రశ్నిస్తే చాలు... బూతులు తిట్టేస్తారు. సినిమా థియేటర్ల నుంచి పన్నులు రావడంలేదు, టికెట్ల వ్యవహారంలో పారదర్శకత లేదు... అంతవరకు ఓకే... కానీ మీరు అమ్మే మందుకు పారదర్శకత ఉందా? మద్యం మీద ఏడాదికి రూ.40 వేల కోట్లు వస్తోందట... మద్యం వ్యాపారంలో వచ్చిన డబ్బును లారీల్లో గట్టి బందోబస్తు మధ్య తీసుకెళుతున్నారంట... నిజమేనా?" అని ప్రశ్నించారు.