Gautam Gambhir: రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడంపై గంభీర్ వ్యాఖ్యలు
- రోహిత్ శర్మకు టీ20, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ
- స్పందించిన గౌతమ్ గంభీర్
- రోహిత్ నాయకత్వంలో టీమిండియా రాణిస్తుందన్న గంభీర్
- ఇతర ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుందని వెల్లడి
టీ20, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించడంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. వేర్వేరు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమించడం మంచి ఆలోచన అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఎంతో మెరుగ్గా రాణిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపాడు. భారత క్రికెట్ సురక్షితమైన హస్తాల్లో ఉందని భావిస్తున్నానని వివరించాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్ల ప్రయోజనం చేకూరుతుందని గంభీర్ వివరించాడు.
ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ, ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు రోహిత్ శర్మ ఐదుసార్లు టైటిల్ అందించిన విషయాన్ని ప్రస్తావించాడు. జట్టును సరైన మార్గంలో తీసుకెళతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ ఎంతో నిదానస్తుడని, అతడి శాంత స్వభావం ఇతర ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గిస్తుందని అభిప్రాయపడ్డాడు.