Shashi Tharoor: మరో అరుదైన పదంతో బీజేపీని విమర్శించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
- బీజేపీ నాయకత్వం అలడొక్సోఫోబియాతో బాధపడుతోంది
- అందుకే చీటికిమాటికి ప్రజలపై రాజద్రోహం కేసులు
- ఈ పదానికి అర్ధాన్ని కూడా విడమరిచి చెప్పిన కాంగ్రెస్ ఎంపీ
ఇంగ్లిష్ భాషపై పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఈసారి మరో పదాన్ని వెతికిపట్టుకొచ్చి బీజేపీపై దాడిచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చీటికి మాటికి ప్రజలపై రాజద్రోహం, యూఏపీఏ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన శశిథరూర్.. దీనంతటికీ కారణం ఆ పార్టీ నాయకత్వం ‘అలడాక్సొఫోబియా’తో బాధపడుతుండడమేనంటూ ట్వీట్ చేశారు.
ఇంగ్లిష్‌లో అత్యంత అరుదుగా ఉపయోగించే పదాల్లో ఇదొకటి. ‘అభిప్రాయాలంటే అహేతుక భయం’ అని ఈ పదానికి అర్థం. బీజేపీ ఇప్పుడు ఇదే భయంతో బాధపడుతోందని శశిథరూర్ విమర్శించారు. ‘వర్డ్ ఆఫ్ ది డే’గా దీనిని పేర్కొన్న ఆయన ‘అలడాక్సొఫోబియా’ పదానికి అర్ధాన్ని కూడా వివరించారు. ఈ పదానికి గ్రీకులో ఉన్న అర్ధం గురించి చెబుతూ.. అల్లో (allo)-విభిన్న, డొక్సో (doxo)- అభిప్రాయాలు, ఫోబోస్(phobos)- భయం అని విడమరిచి చెప్పారు.