Andhra Pradesh: ఏపీలో 2 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండీ హెచ్చరిక
- తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- ఐదు రోజులు తమిళనాడు, పుదుచ్చేరిల్లోనూ వర్షాలు
- పలు రాష్ట్రాల్లో ఉదయం పూట దట్టమైన పొగ మంచు
రానున్న రెండు రోజులు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, రానున్న ఐదు రోజులు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మహె, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, కశ్మీర్, లడఖ్, గిల్గిత్ బల్గిస్థాన్, ముజాఫరాబాద్ లలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో ఈ నెల 16, 17 తేదీల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్‌లలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6-10 డిగ్రీల సెల్సియస్ మధ్య కొనసాగే అవకాశం ఉందని వివరించింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో 3-4 రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పులు కనపడే అవకాశం లేదని చెప్పింది. అసోం, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో రానున్న 48 గంటల పాటు ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.