CM KCR: తమిళనాడులో శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
- తమిళనాడులో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
- శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయ సందర్శన
- సీఎం కేసీఆర్ కు సంప్రదాయబద్ధంగా స్వాగతం
- మంగళవారం సీఎం స్టాలిన్ తో భేటీ కానున్న కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆయన శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు.
అంతకుముందు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రూ, జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు, అర్చకస్వాములు సీఎం కేసీఆర్ కు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సందర్శనకు కేసీఆర్ తో పాటు ఆయన అర్ధాంగి శోభ, తనయుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తాను శ్రీరంగం రావడం ఇది రెండోసారి అని వెల్లడించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వచ్చానని వివరించారు. రంగనాథస్వామి దర్శనం ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. కాగా, మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ అవుతున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.