Phone Record: భార్య ఫోన్ సంభాషణను రహస్యంగా రికార్డు చేయడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణ రికార్డు చేయడం గోప్యత ఉల్లంఘనే
- స్పష్టం చేసిన పంజాబ్-హర్యానా హైకోర్టు
- విడాకుల కేసులో ధర్మాసనం వ్యాఖ్య
భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణను రికార్డు చేయడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య ఫోన్ కాల్ సంభాషణను రహస్యంగా రికార్డు చేయడమంటే గోప్యతను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పంజాబ్లోని భటిండాకు చెందిన ఓ జంట 2009లో పెళ్లితో ఒక్కటైంది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే, ఆ తర్వాత మనస్పర్థలు చెలరేగడంతో తనకు విడాకులు ఇప్పించాలంటూ భర్త 2017లో భటిండాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా తన భార్య సంభాషణలకు సంబంధించిన సీడీని సమర్పించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు భటిండా న్యాయస్థానం అంగీకరించింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా రికార్డు చేసిన మాటలను సాక్ష్యంగా ఎలా పరిగణిస్తారని పేర్కొంటూ భటిండా న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాలు చేశారు.
వాదనలు విన్న న్యాయస్థానం భార్యకు తెలియకుండా ఆమె సంభాషణను రికార్డు చేయడమంటే ఆమె గోప్యతను స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు.