Singareni: టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే సింగరేణి కార్మికుల సమ్మె: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
- తెలంగాణలో కోల్ బ్లాకుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది
- రాష్ట్రాలకు బొగ్గు గనులు కేటాయించలేం
- సింగరేణి కార్మికుల సమ్మె దురదృష్టకరం
తెలంగాణలో నాలుగు కోల్ బ్లాకులకు కేంద్ర ప్రభుత్వం వేలం వేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెపై పార్లమెంటులో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఆ సమ్మె జరిగిందని ఆయన అన్నారు. వేలం ప్రక్రియ ప్రారంభమయిందని స్పష్టం చేశారు.
యూపీఏ హయాంలో బొగ్గు గనులపై సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు మనందరికీ తెలుసని... గతంలో రాష్ట్రాలకు బొగ్గు గనులను కేటాయించి ఉండొచ్చని... ఇప్పుడు తాము ఆ పని చేయలేమని చెప్పారు. సింగరేణి కార్మికులు సమ్మె చేయడం దురదృష్టకరమని అన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడితే సరిపోయేదని చెప్పారు. కోల్ బ్లాకుల వేలంపాటను ఆపి వాటిని సింగరేణికి అప్పగించాలని లోక్ సభ జీరో అవర్ లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సమాధానంగా ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ వాస్తవాల ఆధారంగా లేదని అన్నారు.