YSRCP: పవన్ ఓ అజ్ఞాన వాసి.. ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా?: వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి
- ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి పవన్ కల్యాణే హానికరం
- స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర సర్కారుకి చెందినది
- పవన్ ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకోవాలి
- చంద్రబాబు కాలికి ముల్లు గుచ్చుకొంటే పవన్ కంటిలో కన్నీరు వస్తుంది
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయకూడదని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్షలో సీఎం జగన్‌పై విమర్శలు కురిపించడం ఏంటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి పవన్ కల్యాణే హానికరం అని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్రానిది తప్పు లేదంటూ పవన్ మాట్లాడారని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి కేంద్ర సర్కారుతో పోరాటం చేయాలని అజ్ఞాన వాసి పవన్ కల్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అసలు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో కనీసం ఆయనకైనా అర్థమవుతుందా? అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర సర్కారుకి చెందినదని, ఏపీ ప్రభుత్వానికి చెందినది కాదని ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాలని అప్పిరెడ్డి చురకంటించారు.
ఆ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకూడదని ఇప్పటికే సీఎం జగన్.. ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశారని అప్పిరెడ్డి గుర్తుచేశారు. అంతేగాక, అసెంబ్లీలోనూ తీర్మానం చేశారని అన్నారు. పార్లమెంటులోనూ ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం తమ పార్టీ నేతలు పోరాడుతున్నారని ఆయన చెప్పారు. ఓ వైపు తాము పోరాడుతుంటే మరోవైపు పవన్ కల్యాణ్ తనకు దీనిపై ఏమీ తెలియదన్నట్లు సినిమా నాటకాలు ఆడుతూ ఆందోళనలకు దిగుతున్నారని ఆయన విమర్శించారు.
సుజనా చౌదరిని గతంలో కేంద్ర మంత్రిని చేయడంలో చంద్రబాబు నాయుడు చూపిన శ్రద్ధ విశాఖ ఉక్కు పరిశ్రమపై చూపి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. తన మిత్రుడు చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి పవన్ కల్యాణ్ ఇష్టపడరని అప్పిరెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు నాయుడి కాలికి ముల్లు గుచ్చుకొంటే పవన్ కల్యాణ్ కంటిలో కన్నీరు వస్తుందని ఆయన చురకంటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పవన్ కల్యాణ్ బీజేపీ మీద పోరాటం చేయకుండా వైసీపీ మీద ఉద్యమం చేస్తామని అంటున్నారని ఆయన విమర్శించారు. జగన్‌పై, వైసీపీపై విమర్శలు చేయడం పవన్ కల్యాణ్‌కు అలవాటు అయిపోయిందని ఆయన అన్నారు.