Allu Arjun: పుష్ప ప్రొడక్షన్ మేనేజరుపై కేసు నమోదు... అభిమానులు గాయపడడంపై అల్లు అర్జున్ విచారం

Allu Arjun reacts after fans injured
  • ఇటీవల పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్
  • మరుసటిరోజు ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేసిన పుష్ప టీమ్
  • బన్నీ హాజరవుతారని ప్రకటన
  • ఎన్ కన్వెన్షన్ కు పోటెత్తిన ఫ్యాన్స్
  • కార్యక్రమానికి హాజరుకాని బన్నీ
  • అభిమానుల తొక్కిసలాట
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే, అదే ఊపులో అల్లు అర్జున్ తన అభిమానులను మరింత సంతోషపెట్టాలని భావించారు. వారితో హైదరాబాదు, మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ వద్ద సమావేశం అవ్వాలని భావించారు. అల్లు అర్జున్ ను కలిసి ఫొటోలు దిగొచ్చంటూ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బన్నీ ఫ్యాన్స్ కు సమాచారం అందించింది. దాంతో ఎన్ కన్వెన్షన్ కు అభిమానులు పోటెత్తారు.

ఈ కార్యక్రమం కోసం 500 మందికి మాత్రమే అనుమతి తీసుకోగా, దాదాపు 2 వేల మంది వరకు వచ్చారు. అభిమానుల రద్దీ గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. అనంతరం కార్యక్రమం రద్దు చేశారు. దాంతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తొక్కిసలాట కూడా జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు గాయపడినట్టు సమాచారం.

ఈ వ్యవహారంపై పోలీసులు పుష్ప ప్రొడక్షన్ మేనేజరుపై కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకున్నదానికంటే అభిమానులు ఎక్కువమంది రావడానికి కారకులయ్యారంటూ ఆరోపించారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఫ్యాన్ మీట్ ఈవెంట్ సందర్భంగా కొందరు అభిమానులు గాయపడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తన వ్యక్తిగత బృందం ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించారు. తనకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నారని తెలిపారు. ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతానని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. అభిమానుల ప్రేమే తనకు అత్యంత గొప్ప ఆస్తి అని ఉద్ఘాటించారు.
Allu Arjun
Fans
S Convention
Fan Meet
Pushpa

More Telugu News