Nadendla Manohar: ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లపై సీఎస్ చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవు: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar doubts CS Committee Report on PRC

  • సీఎం జగన్ కు పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పించిన సీఎస్
  • నివేదికలో పొందుపరిచిన అంశాలపై నాదెండ్ల విమర్శలు
  • తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపణ
  • ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్

ఏపీ సీఎం జగన్ కు సమర్పించిన పీఆర్సీ నివేదికలో సీఎస్ సమీర్ శర్మ వివరించిన అంశాలపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లపై సీఎస్ చెబుతున్న గణాంకాలు నమ్మశక్యంగా లేవని విమర్శించారు. ఉద్యోగులను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 111 శాతం మేర జీతాలు, పెన్షన్ల చెల్లింపుకే వెళ్లిపోతుందంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు.

సీఎస్ చెప్పిందే నిజమైతే ఇదే అంశాన్ని బడ్జెట్ సమయంలో ఆర్థికమంత్రి అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ఎవరిని మోసపుచ్చడానికి ఈ తప్పుడు లెక్కలు తయారుచేయించారు? అంటూ మండిపడ్డారు.

"జీతాలు, పెన్షన్ల బిల్లు నెలకు రూ.4,600 కోట్లు ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి, అది తప్పయితే సీఎస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎందుకు ఖండించలేదు? ఏడాదికి రూ.67 వేల కోట్లు ఏ విధంగా ఖర్చవుతుందో ఎందుకు వివరించడంలేదు? వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలి. జాబ్ మేళా స్థాయిలో వందలు, వేల ఉద్యోగాలు కల్పించారా? డీఎస్సీ కూడా నిర్వహించలేదు. 'గ్రూప్' ఉద్యోగాలు సైతం భర్తీ చేయలేదు. మరి వ్యయం ఏవిధంగా పెరిగిందో చెప్పాలి.

ప్రతిపాదిత ఫిట్ మెంట్ (14.29%)తో ఏటా వేల కోట్ల భారం పడుతుందంటున్నారు... ఈ క్రమంలో వాస్తవంగా ఉన్న ఉద్యోగుల లెక్కలు చూపాలి. 2018లో పీఆర్సీ ప్రకటించారు... కానీ 2019 నుంచి 2021 వరకు ఉద్యోగులు భారీ సంఖ్యలో రిటైరయ్యారు. వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైరన తర్వాత కూడా వేల కోట్ల భారం ఎలా పడుతుందో ప్రభుత్వం వివరించాలి.

ఉద్యోగుల వేతనాల అంశంలోనే ఈ స్థాయిలో అంకెల గారడీ చేస్తున్న యంత్రాంగం... రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో ఇంకెన్ని తప్పుడు లెక్కలు వేస్తోందో అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రానికి వస్తున్న రాబడి కంటే జీతాలకే అధిక చెల్లింపులు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం దివాళాకోరుతనానికి నిదర్శనం. ఈ తప్పుడు లెక్కలను ప్రతి ఉద్యోగి ప్రశ్నించాలి, ప్రజలకు వివరించాలి" అంటూ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News