Suryapet District: క్రిప్టో కరెన్సీ కేసు.. తెలంగాణ పోలీసుల అదుపులో కృష్ణా జిల్లా సర్పంచ్
- క్రిప్టో కరెన్సీలో రూ. 70 లక్షల వరకు పెట్టుబడులు
- నష్టం రావడంతో భాగస్వాముల డబ్బు, బంగారం, కార్లు స్వాధీనం
- ఒత్తిడి భరించలేక ఖమ్మంకు చెందిన భాగస్వామి ఆత్మహత్య
- అప్పటి నుంచి పరారీలో లక్ష్మణరావు
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి, నష్టపోవడంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి కారణమయ్యారన్న ఆరోపణలపై కృష్ణా జిల్లా సర్పంచ్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురం వైసీపీ సర్పంచ్ తేళ్ల లక్ష్మణరావు మిత్రుల సహకారంతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. ఖమ్మం జిల్లాకు చెందిన రామలింగస్వామి, జిల్లాలోని జి.కొండూరు మండలం రామచంద్రాపురం, గుడివాడకు చెందిన మరో ఇద్దరు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు.
సర్పంచ్ లక్ష్మణరావు దాదాపు రూ. 70 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. లాభాల మాట దేవుడెరుగు పెట్టుబడి కూడా రాకపోవడంతో భాగస్వాములను లక్ష్మణరావు ప్రశ్నించారు. రాజకీయ నాయకుల అండతో భాగస్వాములను పెనుగంచిప్రోలు పిలిపించిన లక్ష్మణరావు.. వారి నుంచి డబ్బులు, బంగారం, కార్లు బలవంతంగా లాక్కున్నారు. దీంతో గత నెల 23న రామలింగస్వామి సూర్యాపేట లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
శివాపురం సర్పంచ్ లక్ష్మణరావు డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అంతకుముందు రాసిన సూసైడ్ నోట్‌లో రామలింగస్వామి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సూర్యాపేటలో కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న లక్ష్మణరావును గత రాత్రి తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకుని సూర్యాపేట తీసుకొచ్చారు. అయితే, ఆయనను అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఈ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.