Balakrishna: చూద్దాం ఏం జరుగుతుందో.. అన్నింటికీ సిద్ధమయ్యే సినిమా విడుదల చేశాం: బాలకృష్ణ
- టికెట్ ధరలపై హైకోర్టు తీర్పు రాకున్నా అఖండ రిలీజ్
- జీవో రద్దుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్తామంటోంది
- సినిమా కథ బాగుంటే కచ్చితంగా మల్టీస్టారర్ సినిమాలో నటిస్తా
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, సర్కారు జీవోను హైకోర్టు కొట్టివేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు.
టికెట్ ధరలపై హైకోర్టు తీర్పు రాకున్నా ధైర్యంతో అఖండ రిలీజ్ చేశామని ఆయన అన్నారు. సినిమా టికెట్ ధరల జీవో రద్దుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్తామంటోందని, చూద్దాం ఏం జరుగుతుందో అని వ్యాఖ్యానించారు. తాము అన్నింటికీ సిద్ధమయ్యే సినిమా విడుదల చేశామని బాలయ్య తెలిపారు.
కాగా, మల్టీస్టారర్ సినిమాల గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా కథ బాగుంటే తాను కచ్చితంగా మల్టీస్టారర్ సినిమాలో నటిస్తానని తెలిపారు. సరైన కాస్టింగ్ ను బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తాను మల్టీస్టారర్ చేయడానికి ఎప్పుడూ కాదనలేదని, అయితే, అవతలి వారికి ధైర్యం ఉండాలి కదా? అని చెప్పారు.
తనకైతే ధైర్యం ఉందని, తాను మల్టీస్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. అఖండ సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే సినిమాగా ఈ సినిమా అందరి మన్ననలూ పొందిందని చెప్పారు. సినీ పరిశ్రమను కాపాడుకోవడం తమ లక్ష్యమని తెలిపారు.