Virat Kohli: కోహ్లీ వ్యాఖ్యలను ఖండించిన బీసీసీఐ అధికారి
- వన్డే కెప్టెన్ గా తొలగించే ముందు తనతో చర్చలు జరపలేదన్న కోహ్లీ
- కోహ్లీతో చేతన్ శర్మ ముందుగానే చర్చించారన్న బీసీసీఐ
- కోహ్లీ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని వ్యాఖ్య
వన్డే కెప్టెన్ గా తనను తొలగించడంపై టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ తప్పుబట్టింది. తనను వన్డే కెప్టెన్ గా తొలగించే ముందు బీసీసీఐ తనతో ఎలాంటి చర్చలు జరపలేదని కోహ్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ... కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అన్నారు.
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ ప్రకటించి తర్వాత ఆయనతో తాము చర్చలు జరిపామని... అయినా టీ20 కెప్టెన్సీని వదులుకోవడానికే కోహ్లీ మొగ్గుచూపాడని తెలిపారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే సమన్వయం లోపిస్తుందని బీసీసీఐ భావించిందని... అందుకే వన్డే కెప్టెన్ గా కోహ్లీని తొలగించిందని చెప్పారు. ఈ విషయంపై కోహ్లీతో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ ముందుగానే చర్చించారని తెలిపారు.