AP High Court: ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు
- టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ల యజమానులు జాయింట్ కలెక్టర్‌కు తెలపాలి
- ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారు
- ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలి
- తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను మొన్న హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఏపీలో పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకాలు జరగాలని ఆ సందర్భంగా హైకోర్టు తెలిపింది.
అయితే, హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ సినిమా టికెట్ల ధరలపై డిజివిన్ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం అప్పీల్ చేయడంతో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలను వినిపించారు.
చివరకు హైకోర్టు సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ల యజమానులు జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని సూచించింది. సినిమా టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. అంతేగాక, టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.