Cricket: అనుకోకుండా వచ్చిన అవకాశం.. మూడున్నరేళ్ల తర్వాత ఆసీస్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్
- బాల్ ట్యాంపరింగ్ కేసులో కెప్టెన్సీ కోల్పోయిన స్మిత్
- మళ్లీ ఇప్పుడు యాషెస్ సిరీస్ తో కెప్టెన్ గా బరిలోకి
- సెక్స్ చాటింగ్ లతో కెప్టెన్సీకి దూరమైన టిమ్ పైన్
- కొవిడ్ కాంటాక్ట్ గా ఉన్న ప్యాట్ కమిన్స్ సైతం దూరం
స్టీవెన్ స్మిత్.. ట్యాలెంట్ కు కొదవ లేదు. నాయకత్వ లక్షణాలకూ లోటు లేదు. కానీ, ఒక్క తప్పు అతడి కెరీర్ నే సంక్షోభంలోకి నెట్టేసింది. 2018 బాల్ ట్యాంపరింగ్ (శాండ్ పేపర్ గేట్ స్కాండల్– బాల్ ను శాండ్ పేపర్ తో రుద్ది ఆకారాన్ని దెబ్బ తీయడం) వ్యవహారంతో ఏడాది పాటు క్రికెట్ కు, కెప్టెన్సీకి దూరమయ్యాడు. మళ్లీ జట్టులోకి వచ్చి మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. కెప్టెన్ గా మాత్రం అతడికి అవకాశం దక్కలేదు.
తాజాగా మూడున్నరేళ్ల తర్వాత అతడికి అనుకోకుండా ఆ అవకాశం వచ్చింది. అందులోనూ ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో ఆ అవకాశం లభించింది. అసభ్యకర చాటింగ్ తో కెప్టెన్సీ నుంచి, మ్యాచ్ నుంచి టిమ్ పైన్ తప్పుకొన్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ప్యాట్ కమిన్స్ ను క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. వైస్ కెప్టెన్ గా స్మిత్ కు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కరోనా సోకిన వ్యక్తికి క్లోజ్ కాంటాక్ట్ అయిన కమిన్స్ కూడా మ్యాచ్ కు దూరం కావడంతో.. వైస్ కెప్టెన్ గా ఉన్న స్మిత్ కు జట్టు పగ్గాలను అప్పగించింది. రెండో టెస్టు ఇవాళ అడిలైడ్ లో మొదలు కానుంది. ఇది డే నైట్ టెస్ట్. ఈ ఏడాది మార్చిలో తాను మళ్లీ కెప్టెన్సీ చేయాలనుకుంటున్నట్టు స్మిత్ తన అంతరంగాన్ని బయటపెట్టాడు. అది ఇప్పటికి నిజమైంది.
కాగా ఓ రెస్టారెంట్ లో భోజనం చేస్తుండగా.. తన పక్క టేబుల్ లో ఉన్న వ్యక్తికి కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో అతడికి క్లోజ్ కాంటాక్ట్ గా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. కరోనా టెస్ట్ లో ప్రస్తుతం నెగెటివ్ వచ్చినా.. ఆస్ట్రేలియా అమలు చేస్తున్న కఠినమైన బయోబబుల్ నిబంధనలతో అతడు వారం రోజుల పాటు ఐసోలేట్ అవ్వాల్సిన పరిస్థితి. దీంతో అతడిని మ్యాచ్ నుంచి తప్పించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి చెప్పారు. ఇటు అదే రెస్టారెంట్ లో పేసర్ మిషెల్ స్టార్క్, స్పిన్నర్ నేథన్ లైయన్ లూ భోజనం చేశారు.