Tollywood: 'ఒక మహిళ పరువు పోయింది..' అంటూ 'పుష్ప' సాంగ్ పై సినీనటి మాధవీలత కామెంట్లు
- ‘ఊ అంటావా’ పాటపై ఏపీ హైకోర్టులో పురుషుల సంఘం పిటిషన్
- మగవారి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆరోపణ
- పుష్పలోని రారా సామీ సాంగ్.. మహిళలను కించపరిచిందన్న మాధవీలత
పుష్ప ఐటెం సాంగ్ పై ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోందో.. అదే రేంజ్ లో వివాదమూ అలముకుంది. ఇప్పటికే మగవారి మనోభావాలను దెబ్బతీశారంటూ ఏపీలో పురుషుల సంఘం హైకోర్టుకెళ్లింది. మగవాళ్లంతా చెడ్డోళ్లంటూ అర్థం వచ్చేలా ఆ పాట ఉందని, దానిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. చిత్రయూనిట్ తో పాటు, సమంతపై కేసు కూడా పెట్టింది.
దీనిపై సినీనటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ‘‘వాయమ్మో.. పుష్ప మూవీ సాంగ్ మీద కేస్ అంటగా. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీ చెయ్యాలి. నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. పుష్పలోని రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తా. ఏంటీ ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పోలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా? అబ్బాయి నడిచిన చోట భూమిని మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే. నేను పెడతా కేసు. అంతే తగ్గేదేలే’’ అంటూ పోస్ట్ పెట్టింది.
కాగా, సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. పుష్పరాజ్ గా డిఫరెంట్ లుక్ లో అల్లు అర్జున్, అతడికి జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక, విలన్ గా సునీల్ నటిస్తున్నారు.