Voter ID: ఓటర్ ఐడీతో ఆధార్ నెంబర్ లింక్.. ఎన్నికల సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం!
- సీఈసీ సిఫారసులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- కొత్త ఓటర్ల నమోదుకు ఏటా నాలుగు సార్లు అవకాశం
- జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటిన వారికి ఓటరు నమోదుకు అనుమతి
ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సంస్కరణ బిల్లుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఓటర్ ఐడీ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల బోగస్ ఓట్లకు అవకాశం ఉండదు. ఒక వ్యక్తి ఒకటికి మించి ఓట్లను కలిగి ఉండటానికి చెక్ పడుతుంది. దొంగ ఓట్లు వేయడం సాధ్యం కాదు.
కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు ఈ సంస్కరణకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పాన్ కార్డుకు ఆధార్ ను లింక్ చేసినట్టే ఓటర్ ఐడీని కూడా ఆధార్ తో లింక్ చేయబోతున్నారు.
మరోవైపు కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించుకునే వారికి ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రాతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం ప్రతి ఏటా నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలను ఇస్తారు. ప్రతి ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరు నమోదుకు అనుమతించనున్నారు. ఇప్పటి వరకు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. ఎన్నికలను నిర్వహించే ప్రాంగణాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలను అప్పగిస్తూ మరో సవరణ చేశారు.