Cricket: గంగూలీ నోరు విప్పాలి.. కెప్టెన్ కు ఆ హక్కు లేదు.. కోహ్లీ కెప్టెన్సీ వివాదంపై సునీల్ గవాస్కర్ స్పందన

Sunil Gavaskar Said Ganguly To Air Answers On Kohli Row
  • బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ సమాధానం చెప్పాలి
  • కెప్టెన్సీని చీఫ్ సెలెక్టర్ తొలగిస్తే తప్పే లేదు
  • ఆ హక్కు వారికుంటుంది..  
  • కమ్యూనికేషన్ లోపంతోనే సమస్యంతా అన్న గవాస్కర్ 
విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే మాజీలు దీనిపై స్పందించారు. కోహ్లీ సహా ఎవరికీ చెప్పాల్సిన పని లేదంటూ కపిల్ అన్నారు. చెప్పకుండా తొలగించడం షాక్ కు గురిచేసిందని శరణ్దీప్ సింగ్ అన్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఈ వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నోరు విప్పాలని అన్నారు. అప్పుడే వివాదంపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు ఎలా వచ్చాయో చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

‘‘నాకు తెలిసి కోహ్లీ వ్యాఖ్యల్లో బీసీసీఐ ప్రస్తావన లేదు. కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నారన్న మెసేజ్ ఇచ్చిన వారినే ఆ విషయం గురించి అడగాలి. అవును, కచ్చితంగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీనే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకీ వివాదం తలెత్తిందో వెల్లడించాలి. దీనిని పరిష్కరించేందుకు అదే మంచి మార్గం’’ అని చెప్పుకొచ్చారు.

అసలు వివాదం ఎందుకు వచ్చిందో తెలియాలన్నారు. వన్డేలకు కెప్టెన్ గా తప్పిస్తున్నామని చీఫ్ సెలెక్టర్ చెబితే అందులో ఎలాంటి తప్పు లేదని, వారికి అన్ని విధాలా ఆ హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. కెప్టెన్ అనేవాడు జస్ట్ కో–ఆప్టెడ్, నాన్ ఓటింగ్ సభ్యుడు మాత్రమేనని తేల్చి చెప్పారు.

తనకు తెలిసినంత వరకు చీఫ్ సెలెక్టరే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్న విషయాన్ని కోహ్లీకి చెప్పి ఉండొచ్చన్నారు. వీళ్లంతా ఏం చేస్తున్నారో? వాళ్లకేం కావాలో? తనకైతే అర్థం కావడం లేదన్నారు. కెప్టెన్ తో సెలెక్టర్లకు మంచి కమ్యూనికేషన్ ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు రావని, భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అన్నారు.
Cricket
Sourav Ganguly
BCCI
Sunil Gavaskar
Virat Kohli
Rohit Sharma

More Telugu News