Rayban Stories: ఫేస్ బుక్ తో కలిసి రేబాన్ తయారుచేసిన కొత్త కళ్లజోడు నిజంగా వెరీ స్మార్ట్!
- రేబాన్ స్టోరీస్ పేరిట స్మార్ట్ గ్లాసెస్ తయారీ
- కళ్లజోడులోనే ఫోన్
- ధర రూ.22 వేల నుంచి ప్రారంభం
- త్వరలోనే భారత్ మార్కెట్లో ప్రవేశం
రేబాన్ కళ్లజోళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని వయసుల వారికి ఓ ఠీవీని తెచ్చిపెట్టే ఈ అంతర్జాతీయ బ్రాండ్ తాజాగా ఫేస్ బుక్ తో చేతులు కలిపింది. నెక్ట్స్ జనరేషన్ కళ్లజోడు అనదగ్గ రీతిలో స్మార్ట్ గ్లాసెస్ కు రూపకల్పన చేసింది. ఈ కళ్లజోడుకు 'రేబాన్ స్టోరీస్' గా నామకరణం చేశారు.
రేబాన్ స్టోరీస్ కేవలం కళ్లజోడు మాత్రమే కాదు, ఇదొక స్మార్ట్ ఫోన్ కూడా. ఇందులో ఫోన్ కాల్స్ కోసం 3 మైక్రోఫోన్లు, రెండు వైపులా స్పీకర్లు, కుడివైపున టచ్ కంట్రోల్స్, ఫొటోలు తీసుకోవడానికి వీలుగా ఫ్రేమ్ కు రెండు వైపులా 5 ఎంపీ సామర్థ్యంతో కూడిన కెమెరాలు ఏర్పాటు చేశారు.
తాజాగా ఈ స్మార్ట్ గ్లాసెస్ కు సంబంధించిన మరో ఫీచర్ ను మార్క్ జుకర్ బర్గ్ పరిచయం చేశారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా ఫేస్ బుక్ మెసెంజర్ ను కూడా ఉపయోగించవచ్చు. మెసెంజర్ లో సందేశాలు పంపడం, స్వీకరించడం సాధ్యమవుతుందని జుకర్ బర్గ్ వెల్లడించారు.
రేబాన్ గ్లాసెస్ ను 6 వేరియంట్లలో తీసుకువస్తున్నారు. వీటిని గత సెప్టెంబరులో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీ, ఐర్లాండ్, కెనడా దేశాల్లో తీసుకువచ్చారు. త్వరలోనే భారత్ లోనూ ప్రవేశపెట్టనున్నారు. భారత్ లో ఇవి రూ.22 వేల నుంచి రూ.28 వేల మధ్య లభ్యమవుతాయని తెలుస్తోంది.