Konica Layak: బలవన్మరణానికి పాల్పడిన జాతీయస్థాయి మహిళా షూటర్
- కోల్ కతాలో ఘటన
- హాస్టల్ గదిలో ఉరేసుకున్న కొనికా లాయక్
- షూటింగ్ లో రాణించలేకపోతున్నానంటూ సూసైడ్ నోట్
- గతంలో సోనూసూద్ నుంచి గన్ అందుకున్న కొనికా
భారత క్రీడా రంగంలో విషాదం నెలకొంది. జాతీయ స్థాయి యువ షూటర్ కొనికా లాయక్ (26) బలవన్మరణానికి పాల్పడింది. కోల్ కతాలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఉన్న స్థితిలో ఆమెను గుర్తించారు. తాను ఎంతో ఇష్టపడి ఎంచుకున్న షూటింగ్ క్రీడలో రాణించలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని కొనికా లాయక్ సూసైడ్ నోట్ లో పేర్కొంది. కొనికా లాయక్ ఉంటున్న హాస్టల్ గదిలోనే సూసైడ్ నోట్ లభించినట్టు పోలీసులు వెల్లడించారు. కొనికా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గతంలో కొనికా లాయక్ కు నటుడు సోనూసూద్ ఓ జర్మన్ రైఫిల్ ను కానుకగా ఇచ్చారు. తాను షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించినా ఝార్ఖండ్ ప్రభుత్వం నుంచి సాయం అందలేదని కొనికా అప్పట్లో సోనూసూద్ ను ట్యాగ్ చేసింది. దాంతో వెంటనే స్పందించిన సోనూ సూద్ ఆమెకు రూ.2.70 లక్షల విలువైన్ గన్ ను బహూకరించారు.