Sourav Ganguly: "మేం చూసుకుంటాం"... కోహ్లీ వ్యాఖ్యలపై గంగూలీ స్పందన
- టీ20 కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ
- టీ20 కెప్టెన్సీలో కొనసాగాలని సూచించానన్న గంగూలీ
- కొనసాగాలని తనకు ఎవరూ చెప్పలేదని కోహ్లీ స్పష్టీకరణ
- కోహ్లీ తాజా వ్యాఖ్యలపై సమాధానం దాటవేసిన గంగూలీ
టీ20 వరల్డ్ కప్ అనంతరం విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ వదులుకోవడం మొదలు, ఇటీవల అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వరకు భారత క్రికెట్లో పరిస్థితులు ఏమంత సజావుగా లేవన్నది స్పష్టంగా తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని తాను కోహ్లీకి సూచించానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల పేర్కొనగా, తనతో ఎవరూ మాట్లాడలేదని, టీ20 కెప్టెన్ గా కొనసాగాలని ఎవరూ సూచించలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. దాంతో బోర్డుకు, కోహ్లీకి మధ్య దూరం పెరిగినట్టు బహిర్గతమైంది.
ఈ నేపథ్యంలో గంగూలీ స్పందించాడు. అయితే కోహ్లీ వ్యాఖ్యలపై సూటిగా సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపించలేదు. "దీనిపై నేను చెప్పేదేమీ లేదు. ఈ విషయాన్ని బీసీసీఐకి వదిలేయండి... మేం చూసుకుంటాం" అంటూ సమాధానం చెప్పకుండా దాటవేశాడు.
కాగా, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు కూడా కోహ్లీకి ముందస్తు సమాచారం లేదని తెలిసింది. దీనిపై మాజీ క్రికెటర్ల నుంచి భిన్నస్పందనలు వస్తున్నాయి. కెప్టెన్సీపై నిర్ణయం తీసుకునే అధికారం సెలెక్టర్లదేనని కొందరంటుండగా, కెప్టెన్ మార్పు విషయం కోహ్లీకి ముందుగా తెలియజేయడం సబబు అని మరికొందరు అంటున్నారు.